మరోమారు కోవిడ్-19 వ్యాప్తి... ఏపీ సర్కార్ బిగ్ అలర్ట్!
ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే విషయాల్లో కోవిడ్-19 వైరస్ ఒకటనే సంగతి తెలిసిందే!;
ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే విషయాల్లో కోవిడ్-19 వైరస్ ఒకటనే సంగతి తెలిసిందే! ఈ వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతాయి.. లక్షల కుటుంబాలు ఒకసారి గతాన్ని తలచుకుంటాయి! అలాంటి కోవిడ్-19 వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.
అవును... కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా.. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ సమయంలో.. ఎవరికైనా జ్వరం, దగ్గు, నీరసం, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది.
ఇదే సమయంలో... ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర గెట్ టుగెథర్ లు వాయిదా వేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్ట్ వంటి చోట్ల కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్బిణీ స్త్రీలు వీలైనంత వరకూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది!
ఈ సందర్భంగా.. ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించాలని కోరింది. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ.. అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పనిచేసే ల్యాబ్ లు ఉన్నాయని.. అక్కడ తగినన్ని మాస్కులు, పీపీఈ కిట్ లు ఉంచుకోవాలని సూచించింది.
కాగా.. కేరళలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయని.. మే నెలలో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 182 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆగ్నేసియా దేశాల్లో కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని అన్నారు!