రాజధాని విషయంలో వైసీపీ క్రెడిబిలిటీ డౌట్ లో పడుతోందా ?
ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి మరీ అమరావతి రాజధానికి అంకురార్పణ చేశారు.;
విభజన తరువాత ఏపీ తలకాయ లేని మొండెం మాదిరిగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. దాంతో పాటుగా అంతా కలిసి అభివృద్ధి చేసి అరవయ్యేళ్ల పాటు తమ రాజధానిగా సెంటిమెంట్ గా చూసుకున్న హైదరాబాద్ దక్కకుండా పోయింది. అంతా కలిసే ఉందామని సమైక్య పోరాటం ఎంత చేసినా విభజన అయితే తప్పలేదు. ఆనాటి నుంచి ఏపీ ప్రజలకు తమకి సొంతంగా రాజధాని కావాలన్న బలమైన కోరిక మొదలైంది. దానిని అందిపుచ్చుకుని తెలుగుదేశం తాము అధికారంలోకి వస్తే మంచి రాజధానిని నిర్మిస్తామని కేంద్రంలో బీజేపీతో పొత్తు ద్వారా విభజన హామీలు అన్నీ నెరవేర్చుకుందామని చెప్పి అప్పటిదాకా వైసీపీకి ఉన్న పాజిటివ్ గ్రాఫ్ ని సైతం దాటేసి ముందుకు వచ్చేసింది. అలా ఏపీలో టీడీపీ బీజేపీ కలిసి 2014లో అధికారంలోకి వచ్చాయి.
అమరావతికి అంకురార్పణ :
ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి మరీ అమరావతి రాజధానికి అంకురార్పణ చేశారు. దాని కంటే ముందు అసెంబ్లీలో జరిగిన చర్చలో అమరావతి రాజధానికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఇక రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం ఎందుకు గైర్ హాజరు అయింది అన్నది తెలియదని అంటారు. ఆ విధంగా అమరావతి రాజధానికి సభలో జై కొట్టి తీరా బయట మాత్రం వేరే విధంగా వ్యవహరించి వైసీపీ ఒక కన్ఫ్యూజన్ అయితే జనంలో క్రియేట్ చేసింది అని అంటారు.
గట్టిగా చెప్పి మరీ :
ఇక 2019 ఎన్నికల వేళ వైసీపీ గట్టిగా మరో మాట చెప్పింది. తమ అధినేత జగన్ అమరావతి ప్రాంతంలోనే తన నివాసాన్ని నిర్మించుకుంటున్నారని రాజధాని అమరావతిగానే ఉంటుందని ఎక్కడికి పోదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా అయిదేళ్ళూ పాలించిన బాబుకు సొంత ఇల్లు రాజధాని ప్రాంతంలో లేదని కూడా వైసీపీ ఎత్తి చూపింది. దాంతో అమరావతి నిర్మాణం పేరుతో భారీ స్కెచ్ లను గీసి టీడీపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది కదా వైసీపీ దగ్గరుండి మరీ ప్లాట్స్ రైతులకు ఇవ్వడమే కాకుండా అమరావతిని అభివృద్ధి చేస్తుందని నమ్మి మొత్తం కోస్తా బెల్ట్ అంతా ఒకే బాటగా వైసీపీకి ఓటెత్తారు. అలా వైసీపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
మూడు ముక్కలాట మొదలు :
అయితే అధికారంలోకి వచ్చాక వైసీపీ తొలి ఆరు నెలలు మౌనంగా ఉంటూ ఆ తరువాత మూడు రాజధానుల ప్రస్తావనను ముందుకు తెచ్చింది. దాంతో అమరావతి ప్రాంతం భగ్గుమంది. మొదట్లో విశాఖ, కర్నూల్ ప్రాంతంలో కొంత సానుకూలత కనిపించినా అక్కడ కూడా ఏమీ కదలిక లేకపోవడం వల్ల వారు కూడా సైలెంట్ అయ్యారు దానికి తోడు న్యాయపరమైన చిక్కులు అన్నీ కలసి వైసీపీ మూడు రాజధానులు కధ బూమరాంగ్ అయింది అని ప్రత్యర్ధులు విమర్శిస్తారు. అదే 2024 ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో పార్టీ పట్ల విముఖత కలిగించి ఓటమికి దారి తీసింది అని అంటారు.
జై కొట్టినా సరే :
అయితే ఇపుడు వైసీపీ మళ్ళీ అమరావతి రాజధాని విషయంలో తన స్టాండ్ ని బయటపెట్టింది. ఒక వెబ్ మీడియా కాంక్లేవ్ లో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అమరావతి రాజధానికి సానుకూలంగా మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలిస్తామని చెప్పారు. అదే సమయంలో గుంటూరు విజయవాడలను రాజధాని ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని మరో మాట అన్నారు. దాంతో ఇక్కడ కూడా అస్పష్టత ఉందని అంటున్నారు. 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. అలాగే అమరావతిలో అనేక ప్రాజెక్టుల కోసం భూములను ప్రభుత్వం ఇచ్చింది. ఆ పనులు అన్నీ నిర్మాణాలలోకి వస్తున్నాయి. మరి కేవలం గుంటూరు విజయవాడలనే అభివృద్ధి చేస్తామంటే ప్రతిపాదిత అమరావతి ఏమి అవుతుంది అన్నది కూడా మరో చర్చగా మారుతోనిద్.
నమ్మరు కాక నమ్మరంటూ :
దీని మీద కూటమి నేతలు మంత్రులు అయితే ఈ రకమైన వైసీపీ ప్రకటనలను జనాలు నమ్మరని అంటున్నారు. మంత్రి నారాయణ దీని మీద మాట్లాడుతూ కేవలం అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం కోసమే వైసీపీ అధినేత జగన్ రాజధానిపై తన వైఖరిని మార్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్ ఆ తర్వాత పూర్తిగా మాట మార్చారని నారాయణ గుర్తుచేశారు.రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరమని అసెంబ్లీలో స్వయంగా చెప్పిన వ్యక్తి జగన్ అని అన్నారు. అలా అప్పుడు చేతులెత్తి మద్దతు తెలిపి, అధికారం చేపట్టాక మూడు రాజధానుల పేరుతో ఒక పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారని నిందించారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం అమరావతి రాగం అందుకోవడం ప్రజలను మోసం చేయడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి ది బెస్ట్ :
ఇక తాము ఎందుకు అమరావతిని ఎంపిక చేశామో కూడా మంత్రి వివరించారు. అమరావతి భౌగోళికంగా రాష్ట్రానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని అన్నారు. విశాఖపట్నం, అనంతపురం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాలకు కూడా అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని కూడా చెప్పారు. ఇక్కడికి రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు వంటి అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఏ పార్టీ అయినా నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీకి చురకలు అంటించారు.
వైసీపీది గందగోళ విధానం :
అంతే కాదు నారాయణ రాజధాని విషయంలో వైసీపీది గందరగోళ విధానం అని ఏకి పారేస్తున్నారు. ఒక గదిలో నలుగురైదుగురు వ్యక్తులు ఇచ్చే సలహాలు పాటిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం జగన్ కి సరికాదని సూచించారు. ఇక ముందు కూడా ఇలాంటి వైఖరితో ముందుకెళితే భవిష్యత్తులో వైసీపీకి ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కడం కష్టమవుతుందని ఆయన హెచ్చరించారు. అంతే కాదు ఎప్పటికప్పుడు మార్చుకుంటున్న వైసీపీ తీరుని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. మొత్తం మీద చూస్తే రాజధాని విషయంలో వైసీపీ ఏమి చెప్పినా జనాలు నమ్మడం లేదా గందరగోళానికి గురి అవుతున్నారా అన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది.