బీసీలకు ఆరు మేయర్ సీట్లూ ఏడు జెడ్పీలూ !
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు మేరకు యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా బీసీలకు స్థానిక పదవులలో న్యాయం చేస్తూ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ విధంగా బీసీ రిజర్వేషన్ల శాతాలను కూటమి ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజేష్ రంజన్ నేతృత్వంలోని కమిషన్ అందించిన నివేదికను అందులోని సిఫార్సుల ఆధారంగా చేసుకుని మొత్తం ఎనిమిది 8 విభాగాలలో రిజర్వేషన్ల శాతాన్ని కేటాయిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే ఏపీలో వివిధ పదవులలో బీసీలకు పెద్దపీట వేసినట్లు అయింది.
భారీగానే అవకాశాలు :
కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన బీసీ రిజర్వేషన్లు చూస్తే 17 గా ఉన మేయర్ పదవులు: 35.29 శాతం దక్కుతాయి. అంటే ఆరు మేయర్ సీట్లు అన్న మాట. అలాగే 106 దాకా ఉన్న మున్సిపల్ చైర్మన్ పదవులలో 33.02 శాతం అంటే 35 బీసీలకే ఇస్తారు.3,884 దాకా అర్బన్ వార్డులు ఉంటే 32.78 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చారు. ఆ విధంగా వారికి 1,273 వార్డులు లభిస్తాయి. ఏపీలో 13,351 సర్పంచ్ స్థానాలు ఉంటే 27.95 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం 3,128 సర్పంచులు బీసీల నుంచి వస్తారు. 1,33,910 పంచాయతీ వార్డులు ఉంటే 26.73 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, 315 పదవులు వారికి దక్కుతాయి.
లెక్క చూసి మరీ :
అలాగే 9,913 ఎంపీటీసీ స్థానాలకు 25.55 శాతం రిజర్వేషన్ల ప్రకారం 2400 పదవులు బీసీలకు లభిస్తాయి. 661 ఎంపీపీ పదవులు ఉంటే 24.60 శాతం బీసీలకు కేటాయించారు. ఈ లెక్కన 152 పదవులు వారిని వరిస్తాయి. అలాగే 661 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే 24.60 శాతం బీసీలకు రిజర్వ్ చేశారు. దీంతో 152 పదవులు లభిస్తాయి. ఇక 28 జడ్పీ చైర్మన్ పదవులు ఉంటే 23.08 శాతం రిజర్వేషన్ల మేరకు 7 పదవులు బీసీలకు ఇస్తున్నారు.
జనాభా ప్రాతిపదికన :
ఈ విధంగా బీసీలకు న్యాయం చేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకే రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ కేటాయింపులు చేపట్టడం ద్వారా బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇక బీసీల రిజర్వేషన్లు తేలడంతో మిగిలిన పనులు కూడా పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.