బ్రాండ్ ఏపీ.. దేశంలోనే అతిపెద్ద మూడు పరిశ్రమలు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా పెట్టుబడులు-పరిశ్రమలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.;

Update: 2025-07-29 22:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా పెట్టుబడులు-పరిశ్రమలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని మంత్రులు, అధికారుల బృందం పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి నారా లోకేశ్ వివరించారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశంలోనే అతిపెద్ద మూడు భారీ పరిశ్రమలు ఏపీలో ప్రారంభం కాబోతున్నాయని లోకేశ్ వివరించారు.

ఏడాదిలో పెట్టుబడులు

గత ఏడాది జూన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధికి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రత్యేక పారిశ్రామిక పాలసీని రూపొందించి సత్వరమే అనుమతులు ఇవ్వడం, మౌలిక వసతులు, ఇతర రాయితీలు కల్పించడం వల్ల ఏడాది కాలంలో రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు పది లక్షల కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, దీనివల్ల సుమారు 8 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇక సన్ రైజ్ స్టేట్ లో మూడు అతిభారీ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి నారా లోకేశ్ తాజాగా ప్రకటించడం కూడా ఆసక్తికరంగా మారింది.

మూడు పెద్ద పరిశ్రమలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి వచ్చిన పెట్టుబడుల్లో అత్యంత భారీ పరిశ్రమలుగా అనకాపల్లికి సమీపంలో ఏర్పాటయ్యే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్, అనంతపురంలోని ఏర్పాటయ్యే రెన్యు పవర్ ప్లాంట్, విశాఖలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లను మంత్రి లోకేశ్ ఉదహరించారు. దేశంలో అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆదిత్య మిట్టల్ కంపెనీ చూస్తుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని ఆ ఇండస్ట్రీని ఏపీకి తీసుకువచ్చినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. అదేవిధంగా తన మిత్రుడు కరణ్ సూచన మేరకు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఏపీలో ఏర్పాటు కాబోతుందన్నారు. ఇక భారత దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెన్యూ సంస్థ తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ విజయంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెడతామంటే అది వారి వ్యక్తిగత ప్రాజెక్టుగా తాము చూడటం లేదని, ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి చెందిన ఆస్తిగా భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News