చిరంజీవి-బాలకృష్ణ వివాదం..'ఎమ్మెల్సీ' నాగబాబు నోరు మెదపరేం..!

అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో చిరు, పవన్‌ల సోదరుడు, ఇటీవలే ఎమ్మెల్సీ అయిన నాగబాబు స్పందన లేకపోవడంతో పెద్ద విషయంగా మారింది.;

Update: 2025-09-26 14:53 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అంటేనే సంక్లిష్టం.. అలాంటిచోట ఏ ఒక్క చాన్స్‌ దొరికినా ప్రత్యర్థి పార్టీలు విజృంభించేస్తాయి.. ఇప్పుడు ఇలానే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ఉప ముఖ‍్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు వైసీపీ వీటిని అస్త్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై దాడికి దిగుతోంది. కూటమిలో ఎప్పుడు చీలిక వస్తుందా? అని ఎదురుచూస్తున్న సమయంలో అనుకోని వరంగా మారాయి. మెగా అభిమానులు.. బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం సైతం స్పందించి ఖండన ప్రకటన ఇచ్చింది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో చిరు, పవన్‌ల సోదరుడు, ఇటీవలే ఎమ్మెల్సీ అయిన నాగబాబు స్పందన లేకపోవడంతో పెద్ద విషయంగా మారింది.

ఆగ్రహం స్థానంలో నిగ్రహం..

తన సోదరులను ఎవరైనా ఏమైనా అంటే ఒంటికాలిపై లేచేవారు నాగబాబు. పలుసార్లు ఈ విధంగానే ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అంతెందుకు..? గత ఏడాది ఎన్నికల ముందు తమ కుటుంబ సభ్యుడే అయిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటనతో ఏకి పారేశారు. తనవాడు.. పరాయివాడు అంటూ గట్టిగా స్పందించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆగ్రహం స్థానంలో నిగ్రహం పాటిస్తున్నారా? అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో బాలకృష్ణనే టార్గెట్‌గా..

2019 ఎన్నికల సమయంలో జనసేన ఏపీలో ఒంటరిగా పోటీ చేసింది. అప్పటికే టీడీపీ కేడర్‌ జనసేనను ప్రత్యర్థిగా చూడసాగాయి. ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఎవరూ? అన్నట్లు ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడారు. పాతకాలం నటుడు ఒకరు ఇదే పేరుతో ఉన్నారని, ఆయన తనకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడి పొత్తుపెట్టుకోవడం, అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌ళ్యాణ్‌కు మంచి సంబంధాలు ఏర్పడడంతో నాగబాబు ఎలాంటి రాజకీయ విమర్శలు చేసే అవకాశం లేకపోయింది.

ఇప్పుడు ఎమ్మెల్సీగా..

గత ఏడాది ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని భావించిన నాగబాబు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కుదరక ప్రచారానికే పరిమితం అయ్యారు. కూటమి గెలుపుతో ఎమ్మెల్సీ పదవిని పొందారు. మొన్నటివరకు ఆయనకు మంత్రి పదవి ఖాయం అనే కథనాలు వచ్చాయి. సీఎం చంద్రబాబు కూడా ఈ మేరకు స్పష్టంగా చెప్పారు. కానీ, మళ్లీ మధ్యలో ఎందుకనో బ్రేక్‌ పడింది. ఇక తాజా వివాదం విషయానికి వస్తే.. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల నాగబాబు ఏమీ స్పందించలేదు. కూటమి పార్టీల్లోని ఎమ్మెల్సీగా, కాబోయే మంత్రిగానూ ఆయన ఈ వ్యవహారంలో ఏం మాట్లాడుతారో అని అభిమానులు ఎదురుచూశారు. ఒక రోజు గడిచినా ఆయన నుంచి సోషల్‌ మీడియా పోస్ట్‌ కానీ, మీడియా సమావేశం కానీ లేదు. ఒకవేళ బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పా?ఒప్పా? అని చెప్పడం కానీ, అనవసర రాజకీయం చేస్తున్నారని పరిస్థితిని సద్దుమణిగేలా చేయడం కానీ చేయలేదు. గురువారం విడుదలైన పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఓజీ గురించి ఇన్‌స్టా గ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. అదే రోజు అసెంబ్లీలో జరిగిన విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి వైఖరి వ్యక్తం చేయలేదు.

Tags:    

Similar News