భార్యను వదిలేసి ప్రియురాలి కోసం నడిరోడ్డు మీద ఆత్మహత్యాయత్నం
రీల్ కు మించిన రియల్ స్టోరీలు కొన్ని ఉంటాయి. కొన్ని కదిలించేలా ఉంటే.. మరికొన్ని కంపరం కలిగించేలా ఉంటాయి.;
రీల్ కు మించిన రియల్ స్టోరీలు కొన్ని ఉంటాయి. కొన్ని కదిలించేలా ఉంటే.. మరికొన్ని కంపరం కలిగించేలా ఉంటాయి. కానీ.. ఇప్పుడు చెప్పే రియల్ స్టోరీ ఇంచుమించు రెండో కోవకు చెందిందే అయినా.. అతగాడి పిచ్చి ప్రేమ ఏంటి? అన్న విస్మయానికి గురి కాకుండా ఉండలేని పరిస్థితి. అతడి గురించి తెలిసినంతనే చిరాకు.. అసహ్యం కలిగినా.. ప్రియురాలి విషయంలో అతడి కమిట్ మెంట్ కు మాత్రం అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. రీల్ లోనూ ఈ తరహా స్టోరీ చూసి ఉండవేమో.
పెళ్లై.. భార్య.. కుమార్తె ఉన్న ఒక వ్యక్తి ఒక మహిళకు సన్నిహితంగా ఉండటం.. ఆమెను తన నుంచి తీసుకెళ్లారన్న వేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. ప్రియురాలి కోసం ఆస్తిని సైతం ఇట్టే పేపర్ మీద రాసిచ్చేయటం మరో ఎత్తుగా చెప్పాలి. చదివేందుకు కాస్త ఇబ్బందిగా ఉండటమే కాదు.. అసలు ఈ తరహాలో ఎవరైనా ఉంటారా? అన్న సందేహం కలిగే ఈ స్టోరీలోకి వెళితే.. ప్రకాశం - నెల్లూరు జిల్లాకు మధ్యలో ఉండే కలిగిరి మండలం పరిధిలోని ఏపినాపికి చెందిన విష్ణువర్ధన్ కు ఎనిమిదేళ్ల క్రితం సరితతో పెళ్లైంది. వీరికి ఒక కూతురు ఉంది.
అనకాపల్లి సమీపంలో మూడేళ్లుగా ఇటుకబట్టీలో విష్ణువర్ధన్ పని చేస్తున్నాడు. భార్యతో కలిసి ఉండే అతనికి భర్తతో దూరంగా ఉంటున్న ధనలక్ష్మితో పరిచయం కాస్తా వీరిద్దరి మధ్య సంబంధం మరింత సన్నిహితంగా మారింది. దీని గురించి భార్యకు తెలియడంతో భర్త నుంచి దూరంగా వెళ్లి.. భర్త సొంతూరు ఏపినాపిలోని అత్తమామల వద్దే ఉంటోంది. ఇటీవల విష్ణువర్ధన్ ధనలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చాడు.
మరోవైపు ధనలక్ష్మి తల్లిదండ్రులు ఈ నెల 16న అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. వీరి ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు కట్టారు. విష్ణు.. ధనలక్ష్మిలు ప్రకాశం జిల్లా పామూరులోని ఒక లాడ్జిలో ఉంటున్నట్లుగా భార్యకు సరితకు తెలిసింది. దీంతో వారిని పోలీసుల సాయంతో కలిగిరికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జరిగిన వాదనలో అతను తనకున్న ఆస్తిపాస్తులు ఏమీ వద్దని.. ఆస్తి బదిలీ పత్రాల మీద సంతకాలు చేసేసి భార్యకు ఇచ్చేశాడు.
మరోవైపు ధనలక్ష్మి మిస్సింగ్ అయిన కేసుకు సంబంధించి.. ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నఅనకాపల్లి పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులు కలిగిరిలో వీరున్న విషయాన్ని తెలుసుకొని కలిగిరికి వచ్చారు. ధనలక్ష్మిని తమతో తీసుకెళుతుండగా.. ఆమెను తనకు దూరం చేయొద్దంటూ వేడుకున్నాడు. పోలీసులు ఆమెను తీసుకెళుతుండగా.. భరించలేక దగ్గర్లోని షాపులో పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసి అందరూ చూస్తుండగానే రోడ్డు మీద తాగేశాడు. ఇది గమనించిన భార్య.. ఆమె బంధువులు అతడ్ని ఆటోలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. భార్య ఉండి మరో అమ్మాయితో ప్రేమలో పడి.. ఆస్తి మొత్తాన్నిభార్యకు ఇచ్చేసి.. ప్రేయసే ముఖ్యమన్న అతనికి.. ఆమెను తన నుంచి తీసుకెళ్లిపోతున్నారన్న బాధతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా పెను చర్చగా మారింది.