నేత‌ల 'వాకబు': పున‌ర్విభ‌జ‌న పిత‌లాట‌కం.. !

ఇక్క‌డ ఆయ‌న ప‌రిశ్ర‌మను నిర్మించాల‌ని.. ఉన్న‌దానిని విస్త‌రించాల‌ని భావిస్తున్నారు.;

Update: 2026-03-30 15:30 GMT

మ‌నిషి ఆశాజీవి..!. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి మ‌రింత ఆశ‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ప్ర‌త్య‌ర్థుల‌ను అంచ‌నా వేసుకోవ‌డం.. త‌మ గ్రాఫ్‌ను ప‌దిలం చేసుకోవ‌డం.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. గెలుపు గుర్రం ఎక్కాల‌ని త‌హ‌త‌హ‌లాడ‌డం నాయ‌కుల‌కు మామూలే. ఈ క్ర‌మంలో కొంద‌రు నాయ‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై మ‌రింత ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి.. ఇటీవ‌ల ప్ర‌భుత్వం నుంచి భూమిని లీజుకు తీసుకున్నారు.

ఇక్క‌డ ఆయ‌న ప‌రిశ్ర‌మను నిర్మించాల‌ని.. ఉన్న‌దానిని విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర‌కు చెందిన ఓ కీల‌క ఎంపీ కూడా త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని మ‌రింత విస్త‌రించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇప్ప‌టికే ఈయ‌న కూడా స‌ర్కారు నుంచి స్థ‌లాన్ని పొందారు. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ నాయ‌కులు త‌మ త‌మ స్థాయిలో కొన్ని ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకున్నారు. వీటికి గాను ప్ర‌భుత్వం నుంచి భూములు తీసుకున్నారు.

అయితే.. ఇప్పుడు వీరి చింత ఏంటంటే.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిదిలో ఉన్న ఈ భూములు.. ప్ర‌భుత్వం ఇచ్చిన లీజులు.. వంటివి కొన‌సాగేందుకు.. పూర్త‌య్యేందుకు.. కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. అయితే.. ఇంత‌లోనే వీరికి పున‌ర్విభ‌జ‌న వ్య‌వ‌హారం త‌ల‌నొప్పిగా మారింది. ఒక‌వేళ త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో విభ‌జ‌న జ‌రిగితే.. ఆయా ప్రాంతాలు పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కేటాయిస్తే.. లేదా.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డితే.. అప్పుడు త‌మ‌కు ఇబ్బందులు ఉంటాయా? ఉండ‌వా? అనేది వారి ఆలోచ‌న‌.

దీంతో గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై వారు వాక‌బు చేస్తున్నారు. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ప‌రిస్థితి ఉంటుంది? గ‌తంలో ఎలా చేశారు? ఇప్పుడు ఎలా జ‌రుగుతుంది? అంటూ.. మీడియా మిత్రుల‌కు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. వాస్త‌వానికి పున‌ర్విభ‌జ‌న అంశంపై కేంద్రం క‌మిటీ వేయాలి.. ఆ క‌మిటీ రాష్ట్రాల‌ను సంప్ర‌దించాలి.. జ‌నాభా లెక్కుల అంశం తేలాలి. ఇవ‌న్నీ పూర్త‌య్యాక కానీ.. నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌పై స్ప‌ష్టత వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అయినా.. నాయ‌కులు ముందుగానే ఈ విష‌యంపై వాక‌బు చేస్తూ... జాగ్ర‌త్త ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News