చంద్రబాబు పట్ల మత్స్యకారుల కృతజ్ఞత.. ఏం చేశారంటే
ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయా కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఇస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ సీఎం చంద్రబాబు పట్ల మత్స్యకారులు కృతజ్ఞతా భావాన్ని చూపించారు. వరుసగా రెండో ఏడాది మత్సకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కొక్క కుటుంబానికీ 20 వేల రూపాయల చొప్పున.. చంద్రబాబు తాజాగా వారి వారి ఖాతాల్లో నిధులు జమ చేశారు. మత్స్యకారులకు ప్రస్తుతం వేట నిషేధ సమయం ప్రారంభమైంది. సముద్రంలో చేపలు పట్టేందుకు అనుమతి ఉండదు. చేపలు, సముద్ర జీవుల సంతానోత్పత్తి సమయం నేపథ్యంలో ఏటా ఈ నిషేధం కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయా కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఇస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల చొప్పున ఇవ్వగా కూటమి ప్రభుత్వం దానిని మరో 5 వేలకు పెంచి 20 వే లచొప్పున ఇస్తోంది. దీనిని పురస్కరించుకుని మత్స్యకారులు తమ కృతజ్ఞతను ప్రదర్శించారు.
కృష్ణానదిలో పెద్ద సంఖ్యలో బోట్లు, పడవలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటి వరకూ కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకి మత్స్య కారులు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతాలైన వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మర పాలెంలకు చెందిన మత్స్య కారులు సుమారుగా వంద బోట్లతో కృష్ణా నదిపై ర్యాలీ నిర్వహించారు. మత్స్యకారుల ర్యాలీని ఇంట్లోంచి చూసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అభివాదం చేస్తూ.. వారిని తన ఇంటికి ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చిన మత్స్యకారులను అభినందించిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ`గంగపుత్రులు.. అభిమాన మిత్రులు. యువగళం పాదయాత్ర జువ్వలదిన్నె చేరుకున్నప్పుడు మత్స్యకారుల పట్టుదల, ఐకమత్యం చూశానని గుర్తు చేశారు. ఊరంతా శుభ్రం చేసి, రంగు రంగుల ముగ్గులతో ఒక పండగలా తనకు స్వాగతం పలికారని, అంతా కలిసి ఒక్క మాట అనుకుంటే, దానిపై నిలబడతారని చెప్పారు. మత్స్యకారుల నుంచి ఈ మాట మీద నిలబడే తత్వం అందరం అలవర్చుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.