'అనంత' ను వదిలేశారా బాబూ.. !
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రాజకీయ వివాదాలు, రాజకీయ ఘర్షణలు, నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.;
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రాజకీయ వివాదాలు, రాజకీయ ఘర్షణలు, నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నాయకుల మధ్య విభేదాలు అయితే కామన్ గా ఉన్నాయి. ముఖ్యంగా ధర్మవరం, రాప్తాడు వంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకుల్లోనే విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎవరూ కూడా రోడ్డున పడడం గానీ సవాళ్లు విసురుకోవడం కానీ అనేది పెద్దగా లేదు.
అంతర్గతంగా కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. రాయదుర్గంలో కూడా ఇటీవల కాల్వ శ్రీనివాసులకి వ్యతిరేకంగా విమర్శలు రావడం విశేషం. నిజానికి సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చాలా సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్నారు. అందరికీ అందుబాటులో ఉండే నేతగా పేరు కూడా ఉంది. అదేవిధంగా కేవలం తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అందర్నీ కలుపుకొని పోయే లక్షణాలు ఉన్న నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
కానీ ఇటీవల ఆయనపై సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. ఇక రాప్తాడు, ధర్మవరంలో అయితే ఆది నుంచి ఉన్న ఘర్షణలే ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇటు ప్రతిపక్షం కన్నా అధికారపక్షంలోనే అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఆది నుంచి మరింత వివాదాస్పదంగా కొనసాగుతున్న నియోజకవర్గం తాడిపత్రి. ఇక్కడ అధికార పక్షంలోనే నాయకుల మధ్య విభేదాలు ఉండగా ... ప్రతిపక్షంపై మరింత ఎక్కువగా దూకుడు ప్రదర్శిస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది.
రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు. అదేవిధంగా అంతర్గతంగా సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా కొనసాగుతాయి. దీన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ అదే పనిగా ప్రజా సమస్యలను కూడా వదిలేసి ప్రతిపక్షంపై విమర్శలు చేయడం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం వంటివి స్థానికంగా ఉన్న టిడిపి నాయకులకు ఇబ్బందిగా మారింది. వారు గుర్తించకపోయినా ప్రజల మధ్య జరుగుతున్న చర్చ అయితే ఇదే. ``ఎన్నాళ్ళు ఈ గొడవలు అంటూ`` చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసిపి నాయకులను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సమర్ధించకపోయినా టిడిపి అనుసరిస్తున్న విధానాలను మాత్రం తీవ్రంగా తప్పు పడుతున్నారు. మరి ఈ దిశగా నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం దూకుడు మాత్రమే పనిచేయదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకులూ మారాల్సిన అవసరం ఉందన్నది గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారనేది వేచి చూడాలి.
మరోవైపు చంద్రబాబు ఈ విషయాన్ని అసలు పట్టించుకోనట్టే వదిలేసారు అన్న వాదన వినిపిస్తోంది. ఆయనకు కూడా ఇది మంచి పరిణామం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ఏదో ఒకటి తేల్చడం ద్వారా తాడిపత్రిలో నెలకొన్న వివాదాలను సర్దుమణిగేలా చేయాలని చెబుతున్నారు.