నెలకు రూ.9 లక్షల జీతం ఆఫర్.. అయినా ఖాళీగా 5వేల పోస్టులు

అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్.. ఎలక్ట్రికల్.. ట్రక్కింగ్.. ఫ్యాక్టరీ రంగాల్లో పది లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్న విషయాన్ని పేర్కొన్నారు.;

Update: 2025-11-18 06:33 GMT

రోటీన్ కు భిన్నమైన అంశాల్ని ప్రస్తావిస్తూ.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసే ప్రతి పోస్టుపైనా మీడియానే కాదు.. సోషల్ మీడియా సానుకూలంగా స్పందించే పరిస్థితి. ఇంతకూ ఆ పెద్దమనిషి మరెవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయనో కీలక ట్వీట్ చేశారు. వైట్ కాలర్ ఉద్యోగాల్ని ఏఐ లేకుండా చేస్తుందని అందరూ భయపడుతున్నారు కానీ.. నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరతగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్స్ సీఈవో జిమి్ ఫార్లే పాడ్ కాస్ట్ ను ఉటంకించటం ద్వారా.. తానేదో అల్లాటప్పాగా ట్వీట్ చేయటం లేదని.. సరైన సాక్ష్యాన్ని.. ఆధారాన్ని చూపిస్తున్నట్లుగా చెప్పాలి. ఇంతకూ ఈ పాడ్ కాస్ట్ లో ఉన్న ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే.. తమ సంస్థలో 5వేల మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఫోర్డ్ సీఈవో పేర్కొన్నారు. ఈ పోస్టులకు వార్షికంగా రూ.కోటి ఆఫర్ చేసినా.. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాలేదని పేర్కొన్నారు.

అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్.. ఎలక్ట్రికల్.. ట్రక్కింగ్.. ఫ్యాక్టరీ రంగాల్లో పది లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్న విషయాన్ని పేర్కొన్నారు. ఇవేమీ ప్యూచర్ లో ఉండే ఖాళీలు కావని.. వర్తమానంలో జరుగుతుందని చెప్పటం ద్వారా.. మనం ఫోకస్ చేయని పలు అంశాలు ఉన్నట్లుగా చెప్పాలి. దశాబ్దాలుగా డిగ్రీలు.. డెస్క్ ఉద్యోగులను ఉన్నతంగా భావిస్తూ రావటం.. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పట్టించుకోకపోవటంతో ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందని చెప్పటం గమనార్హం.

అంతే కాదు.. ఈ రంగాలకు చెందిన ఉద్యోగాల్ని ఏఐ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించలేదని సదరు పాడ్ కాస్ట్ లో పేర్కొన్నారు. సమాజంలో కలల కెరీర్ గా భావించే వాటికి సంబంధించి సమూలంగా మార్పులు చూడబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు నడుస్తున్న ధోరణి ఇదేలా కంటిన్యూ అయితే.. ప్రపంచాన్ని నిర్మించగల.. మరమ్మతు చేయగల.. నడిపించగల వ్యక్తులే ఏఐ యుగంలో అతి పెద్ద విజేతలుగా నిలుస్తారని చెబుతున్నారు.

ఈ పరిణామంపై ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో పేర్కొన్నారు. ‘‘పోరాటం ద్వారా కార్మికులు పైకి వస్తారని కార్ల్ మార్క్స్ ఊహించారు. కానీ.. నైపుణ్యం.. కొరత వంటి కారణాలతో వారు ఎదుగుతారని ఊహించలేదేమో. హింస ద్వారా కాకుండా.. శ్రామిక నైపుణ్యాల ద్వారా ఏర్పడిన విప్లం ఇది’ అంటూ పేర్కొన్న పోస్టు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అగ్రరాజ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నవిషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆనంద్ మహీంద్రా చెప్పేశారని చెప్పాలి.

Tags:    

Similar News