ఏపీలో మరో రంగారెడ్డి జిల్లా...బాబు జోస్యం ఇది

ఇక పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని చంద్రబాబు చెప్పారు.

Update: 2026-09-02 22:30 GMT

తెలంగాణాలో రంగారెడ్డి జిల్లా ఇపుడు ఎంతలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. రంగారెడ్డిలో ఇపుడు భూములు ఎంత ఖరీదు అన్నది కూడా తెలిసిందే. అంతే కాదు ఈ జిల్లాలో సమగ్రమైన ప్రగతి కనిపిస్తోంది. గతంలో ఎవరూ ఈ జిల్లా గురించి ఇంతలా అనుకోలేదు. కానీ ఇపుడు కేరాఫ్ డెవలప్మెంట్ గా మారింది. మరి అలాంటి రంగారెడ్డి జిల్లా ఇంకోటి ఏపీలో ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. కచ్చితంగా ఏపీకి రంగారెడ్డి జిల్లా అదే అని చూపిస్తున్నారు. ఆ జిల్లా పేరే అనకాపల్లి. అనకాపల్లి ఇటీవల కాలం వరకూ ఒక మామూలు రూరల్ జిల్లాగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో అక్కడికే పరిశ్రమలు అన్నీ పరుగులు తీస్తున్నాయి. ఒకటి తర్వాత మరొకటి అక్కడ ఏర్పాటు అవుతున్నాయి. ఇక సాగు తాగు నీరుతో పాటు పరిశ్రమలా అవసరాలకు సరిపడా నీరు అందించేందుకు గోదావరి జలాలలను పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు పంపించే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దాంతో అనకాపల్లి ఇపుడు అన్ని విధాలుగా విస్తృతమైన అభివృద్ధికి నోచుకునేందుకు అవకాశాలు వేయింతలు అయ్యాయి.

అభివృద్ధి అడ్రస్ లా అనకాపల్లి :

అనకాపల్లి అభివృద్ధికి అడ్రస్ గా మారుతుందని గోదావరి జలాలను ఉత్తరాంధ్ర కు తరలించే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లా తరహాలోనే అనకాపల్లి అభివృద్ధికి గేట్ వే అవుతుందని అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం అనకాపల్లిలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు ఉత్తరాంధ్రకే రానున్న కాలంలో జనాలు అంతా వలసలు వస్తారని ఆయన అన్నారు. దాంతో ఉత్తరాంధ్ర ఉన్నతాంధ్ర అవుతుందని కూడా చెప్పుకొచ్చారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని అలాగే తాగు నీరు అందుతుందని కూడా బాబు చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామని బాబు హామీ ఇచ్చారు.

పెద్ద ఎత్తున అవకాశాలు :

ఇక పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని చంద్రబాబు చెప్పారు. 12 ప్రధాన ప్రాజెక్టులను 3,200 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆహ్యన చెప్పారు. విశాఖ పరిసరాలలో పెద్ద పెద్ద డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. అలాగే ఆసియా మొత్తాన్ని కనెక్టు చేసే సబ్ సీ కేబుల్ కనెక్టివిటీ విశాఖకు వస్తోందని చెప్పారు. హార్బర్లు, మూలపేట పోర్టులతో తూర్పు తీరాన్ని మధ్య భారత్ తో కనెక్టు చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు.

విశాఖకు నీటి కొరత లేదు :

ఇక విశాఖకు డేటాసెంటర్లు వస్తే నీరు విద్యుత్ కొరత వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మీద బాబు మండిపడ్డారు. డేటా సెంటర్లు మొత్తానికి కావాల్సింది కేవలం అయిదు టీఎంసీల నీళ్లు మాత్రమే అని అన్నారు. కానీ పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకువచ్చే సామర్థ్యం ఉందని చెప్పారు. గ్రావిటీ ద్వారా నీరు వస్తే విశాఖకు నీటి ఎద్దడే ఉండదని అన్నారు. ఇక విశాఖపట్నం ఏఐ పట్నం గా తయారవుతుంని బాబు జోస్యం చెప్పారు. గూగుల్ హబ్ గా, నాలెడ్జి ఎకానమీగా పరిశ్రమలు, వ్యవసాయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్రస్ గా మారుతుందని వివరించారు. వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బాబు చెప్పారు. రెండేళ్లలో సాగునీటి కోసం 25 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన అన్నారు.

Tags:    

Similar News