పంజరం వెనుక మానసిక నరకం: జంతువుల డిప్రెషన్‌ను మనం గుర్తించగలమా?
ఇక జూకి వచ్చే వీక్షకులకు ఇవి వింత చేష్టలుగా అనిపించవచ్చు కానీ, నిజానికి అది ఆ జీవులు పడే తీవ్రమైన మానసిక డిప్రెషన్‌కు సంకేతం.
మనం సరదాగా జూకి వెళ్లి పంజరంలో ఉన్న పక్షులను, జంతువులను చూసి నవ్వుకుంటూ సమయాన్ని గడిపేస్తాం. కానీ ఆ కిటికీల వెనుక ఉన్న నిశ్శబ్ద నరకాన్ని ఎప్పుడైనా గమనించామా? ఢిల్లీ జూలో గత 20 ఏళ్లుగా ఒంటరితనంతో నరకం అనుభవిస్తున్న ‘జటాయువు’ అనే ఈజిప్షియన్ రాబందు కథ కేవలం ఒక పక్షి కథ కాదు. సుదీర్ఘకాలం తోడు లేకపోవడం వల్ల జంతువులు, పక్షులు పడే మానసిక వేదనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. పంజరం వెనుక జీవులు ఎదుర్కొంటున్న ఈ డిప్రెషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
20 ఏళ్ల ఒంటరితనం – 'జటాయువు' పడుతున్న వేదన:
సుమారు 20 ఏళ్ల క్రితం గాయపడి ఢిల్లీ జూకి వచ్చిన ‘జటాయువు’ అనే రాబందు తన జీవితంలోని బంగారంలాంటి సమయాన్నంతటినీ పంజరంలో ఒంటరిగానే గడిపేసింది. సాధారణంగా ఈజిప్షియన్ రాబందులు ఐదేళ్ల వయసుకే ఒక జంటగా మారి, జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయి. కానీ ఈ రాబందు మాత్రం తనతోటి పక్షులన్నీ చనిపోవడంతో రెండు దశాబ్దాలుగా తోడు లేకుండా మిగిలిపోయింది. ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 6న అధికారులు పింజోర్ కేంద్రం నుంచి దీనికో భాగస్వామిని తెచ్చేందుకు అన్వేషణ మొదలుపెట్టారు.
జీవులలో మానసిక రుగ్మతలు – 'జూకోసిస్' ముప్పు:
వైల్డ్‌లైఫ్ సైకాలజీ ప్రకారం సుదీర్ఘకాలం తోడు లేక ఒంటరిగా ఉండే జీవులు 'జూకోసిస్' (Zoochosis) అనే తీవ్రమైన మానసిక రుగ్మతకు గురవుతాయి. పంజరంలో ఒకే చోట పదే పదే గుండ్రంగా తిరగడం, తమ ఈకలను తామే పీక్కోవడం, గోడలకు తల బాదుకోవడం లేదా ఆహారం మానెయ్యడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఇక జూకి వచ్చే వీక్షకులకు ఇవి వింత చేష్టలుగా అనిపించవచ్చు కానీ, నిజానికి అది ఆ జీవులు పడే తీవ్రమైన మానసిక డిప్రెషన్‌కు సంకేతం.
కేవలం భోజనం పెడితే 'సంరక్షణ' అయిపోతుందా?:
మనం జూల నిర్వహణను కేవలం ఆహారం ఇవ్వడానికే పరిమితం చేస్తున్నాం. సమయానికి తిండి పెట్టడం మాత్రమే సంరక్షణ అనిపించుకోదు. జంతువుల సామాజిక, భావోద్వేగ అవసరాలను పట్టించుకోకపోవడం కూడా ఒక రకమైన హింస కిందకే వస్తుంది. ఇక ఢిల్లీ జూలో కేవలం రాబందు మాత్రమే కాకుండా ఆస్ట్రిచ్‌లు, గుడ్లగూబలు, పునుగుపిల్లులు, ఒక ఆడ ఖడ్గమృగం వంటి దాదాపు 16 జీవులు తోడు లేక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి.
జూల నిర్వహణలో మారాల్సిన ఆలోచనా ధోరణి:
ప్రస్తుతం ఢిల్లీ జూ రూపురేఖలు మార్చడానికి 109 కొత్త జాతులను, దాదాపు 2,943 జంతువులను కొత్తగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కొత్తగా వేల జంతువులను తెచ్చి ప్రదర్శనకు పెట్టడం కంటే, ఇప్పటికే మన ఆశ్రయంలో ఉన్న జీవులకు మానసిక ఆరోగ్యంతో కూడిన వాతావరణాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. ఇక జూలను కేవలం "వినోద కేంద్రాలు"గా చూడటం మానేసి, వాటిని నిజమైన "సంరక్షణ కేంద్రాలు"గా మార్చాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది.
జటాయువుకు దక్కబోయే భాగస్వామి వల్ల దానికి కొంత ఊరట లభించవచ్చు. కానీ 20 ఏళ్ల పాటు ఆ పక్షి అనుభవించిన ఒంటరితనానికి పరిహారం దొరకదు. ఇకపై మనం జూకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న జంతువు బాహ్య రూపాన్ని మాత్రమే కాదు, దాని కళ్లలోని నిశ్శబ్ద వేదనను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. జంతువుల మానసిక ఆరోగ్యంపై సమాజంలో విస్తృతమైన అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.