వైసీపీ వీక్...టీడీపీ హౌస్ ఫుల్

ఉత్తరాంధ్రాలో చాలా నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలు. అవి పార్టీ ఆవిర్భావం నుంచి అలా కొనసాగుతూ వస్తున్నాయి.;

Update: 2026-01-06 08:30 GMT

ఉత్తరాంధ్రాలో చాలా నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలు. అవి పార్టీ ఆవిర్భావం నుంచి అలా కొనసాగుతూ వస్తున్నాయి. అందులో ఒకటి ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి. ఇక్కడ టీడీపీ ఓటమి చెందింది మూడు సార్లు. మిగిలిన అన్ని సార్లూ మంచి మెజారిటీతో గెలిచింది. దానికి కారణం బలమైన స్థానిక నాయకత్వం ఉండడమే. టీడీపీ నుంచి 1983లో కొత్త వారికే టికెట్ ఇచ్చారు. అయితే నాదెండ్ల ఎపిసోడ్ లో పార్టీ మారిపోయారు. ఇక అప్పటికి హిందీ మాస్టార్ గా ఉన్న దాడి వీరభద్రరావుని తెచ్చి 1985లో ఎన్టీఆర్ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆయన వరసగా నాలుగు సార్లు గెలిచి రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2004లో ఓటమి చెందారు. ఆ తరువాత శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రతిపక్ష నేతగా అవకాశం దక్కింది. కానీ రెండోసారి ఎమ్మెల్సీ చాన్స్ రాలేదని ఆయన వైసీపీలోకి చేరిపోయారు. అలా ఆయన రాజకీయ జాతకం మారిపోయింది.

కొత్త నాయకత్వంతో :

ఇక టీడీపీ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించింది. అలా పీలా గోవింద్ అనకాపల్లి నుంచి 2014లో ఎమ్మెల్యే అయ్యారు ఆయన మంచి పట్టు సాధించి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. వైసీపీలో ఏ విధమైన రాజకీయ అవకాశాలు రాకపోవడంతో దాడి వీరభద్రరావు ఫ్యామిలీ తిరిగి టీడీపీలోకి వచ్చి చేరింది. అప్పటికే పీలా గోవింద్ నాయకత్వం బలంగా ఉంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి కొణతాల రామకృష్ణ పోటీ చేసి గెలిచారు. ఆయన పీలా గోవింద్ వియ్యంకులు కావడంతో కూటమి రాజకీయ బంధం మరింతగా ఇక్కడ బలోపేతం అయింది. పీల వర్గం హవాయే ఇప్పటికీ అనకాపల్లిలో ఉంది. దాంతో దాడి వర్గం ఉక్కిరి బిక్కిరి అవుతోంది అని అంటున్నారు.

వైసీపీలో అయోమయం :

వైసీపీకి సరైన నాయకత్వం లేకపోవడం ఇబ్బందిగా ఉంది. 2014లో కొణతాల రామకృష్ణ సోదరుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత కొణతాల వైసీపీని వీడడంతో అనకాపల్లిలో వైసీపీలి బలమైన సామాజిక వర్గం దూరం అయింది. 2019లో జగన్ ఊపులో గుడివాడ అమర్నాధ్ గెలిచినా 2024లో కొత్త అభ్యర్థిగా ఎన్నారై అయిన భరత్ ని తెచ్చి పోటీ చేయించారు. దాంతో టీడీపీ కూటమి మంచి మెజారిటీతో గెలిచింది. ఇక దాడి ఫ్యామిలీ కూడా వైసీపీ నుంచి తప్పుకోవడంతో గవరల మద్దతు కూడా వైసీపీకి పెద్దగా దక్కడం లేదు అని అంటున్నారు. ఇప్పటికీ సరైన నాయకత్వం లేక అనకాపల్లిలో వైసీపీ అయోయమంగా ఉందని ప్రచారం ఉంది.

దాడి వర్గం అసంతృప్తి :

ఇక టీడీపీలో దాడి వర్గం అసంతృప్తితో ఉంది అని అంటున్నారు. తమకు పార్టీలో సరైన అవకాశాలు లేవని మధన పడుతోంది. దాడి కుమారుడికి జిల్లా అధ్యక్ష పదవి కూడా దక్కలేదు, నామినేటెడ్ పదవిలో ఆయన పేరు లేదు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కి కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. దీంతో దాడి వర్గం పరిస్థితి స్వపక్షంలో విపక్షంగా తయారైంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వైసీపీలో పెద్ద నాయకులు లేక అల్లాడుతూంటే టీడీపీ కూటమిలోనే మొత్తం నాయకులు చేరడంతో బలంగా మారింది. ఏది ఏమైనా వైసీపీకి సరైన వ్యూహాలు లేక చతికిలపడుతూంటే హెవీ వెయిట్ తో కూటమి ఆపసోపాలు పడుతోంది. ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితి అనకాపల్లిలో ఉందని అంటున్నారు.

Tags:    

Similar News