2029 లో పీఎం అతనే !
అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో తనదైన శైలిలో క్రియాశీల పాత్రతో బలమైన ముద్ర వేసిన ఆయనే అమిత్ షా. ఆయన అత్యంత శక్తివంతమైన హోం మంత్రిగా ఉన్నారు.;
ఇది జోస్యం కాదు, సర్వే అంతకంటే కాదు, అధ్యయనం కూడా కాదు, రాజకీయ విశ్లేషణ గా చెప్పొచ్చు. జరుగుతున్న పరిణామాలను నిజంగా విశ్లేషించుకుంటే కనుక అతనే సువిశాల భారత దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అన్నది ఒక విశ్లేషణగా ఉంది ఆయన ఎవరో కాదు కేంద్రంలో గత పదకొండేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఎన్డీయే ప్రభుత్వంలో నంబర్ టూ. బీజేపీలో అగ్ర నేత. అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో తనదైన శైలిలో క్రియాశీల పాత్రతో బలమైన ముద్ర వేసిన ఆయనే అమిత్ షా. ఆయన అత్యంత శక్తివంతమైన హోం మంత్రిగా ఉన్నారు.
ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తరువాత స్థానంలో ఉన్నారు. నరేంద్ర మోడీ ఆయనది గొప్ప జోడీ. బీజేపీలో ఆనాడు వాజ్ పేయ్ ఎల్ కే అద్వానీ మాదిరిగా ఈ ద్వయం కూడా కమలం పార్టీని మరింతగా పరుగులు పెట్టించింది. ఈ ఇద్దరూ కలసి బీజేపీకి సరికొత్త రాజకీయ చరిత్రను లిఖించారు. ఇక వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉంటూ వచ్చిన నరేంద్ర మోడీ 2029లో సైతం ప్రధాని అవుతారా అంటే ఏమో డౌటే అన్న మాట వినిపిస్తోంది.
ఆనాటికి మోడీకి ఎనభై ఏళ్ళు వస్తాయి. దాంతో ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటారని అలా ఖాళీ అయిన ప్రధాని పీఠాన్ని అమిత్ షా అధిరోహించి ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని చాలా రకాలుగా ప్రచారం సాగుతూనే ఉంది. అది పుకారుగా ఊహాగానాలుగా కూడా వ్యాప్తిలో విస్తృతంగా ఉంది. ఇదిలా ఉంటే ఇపుడు అమిత్ షా హోం మంత్రి కదా మోడీ ప్రధానిగా మరో నాలుగేళ్ళ పాటు ఉంటారు కదా 2029 గురించి ఇపుడు ఎందుకీ చర్చ అని అనుకోవచ్చు.
దానికి అమిత్ షా తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆస్కారాన్ని కల్పించాయని చెప్పాల్సి ఉంది. తాజాగా అమిత్ షా సహకార సంఘాల మహిళా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఎపుడో జరగబోయే తన రాజకీయ రిటైర్ మెంట్ గురించి ప్రస్తావించారు. రిటైర్మెంట్ తరువాత తాను వ్యవసాయం చేస్తాను అని అమిత్ షా అన్నారు. అలాగే వేదాలు ఉపనిషత్తులు చదువుకుంటూ ఆధ్యాత్మిక లోకం లో ఉంటాను అని చెప్పారు.
అయితే రాజకీయంగా చూస్తే అమిత్ షాది పదవీ విరమణ చేసే వయసు ఏమీ కాదు. ఆయన హోం మంత్రిగా కేంద్రంలో గత ఆరేళ్ళుగా ఉంటూ వస్తున్నారు. అంతకు ముందు జాతీయ బీజేపీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. దాని కంటే ముందు గుజరాత్ లో మోడీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నారు
ఇక అమిత్ షా చూస్తే రాజకీయంగా మంచి పండు వయసులో ఉన్నారు ఆయన ఇంకా ఎక్కాల్సిన శిఖరాలు చాలా ఉన్నాయని అభిమానులు అంటారు. మరి వాటిని పక్కన పెట్టేసి సడెన్ గా ఆయన తన పదవీ విరమణ గురించి చెప్పడంతో అందరి ఆలోచనలు దాని మీదకు మళ్ళుతున్నాయి. ఇక రాజకీయ విశ్లేషణలు చూస్తే మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అమిత్ షా రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారంటే దాని కంటే ముందు లక్ష్యాలు బహు దగ్గరలో ఉన్నట్లేనా అన్నది కూడా చర్చగా ఉంది.
మరో వైపు చూస్తే కేంద్రంలో బలమైన నాయకులుగా మోడీ అమిత్ షా ఉన్నారు. బీజేపీలోనూ అంతే. మరి మోడీ కనుక 2029 ఎన్నికల తరువాత తప్పుకుంటే ప్రధాని అయ్యేది కచ్చితంగా అమిత్ షాయే అన్న ప్రచారం కూడా ఉంది అందుకే ఆయననేనా కాబోయే ప్రధానమంత్రి అని అంతా అంటున్నారు. ఇక చూస్తే కనుక దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. అవి 2027 చివరిలో జరుగుతాయని అంటున్నారు.
అలా విశ్లేషిస్తే బీజేపీకి నాలుగవ సారి విజయం సాధించి పెట్టిన తరువాత మోడీ తప్పుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీలో చూస్తే మరి కొంతమంది పేర్లు కూడా ప్రధాని రేసులో ఉన్నాయని చెబుతారు. అందరి కంటే ముందుగా నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. ఆయన ఈ మధ్యనే ఒక చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చూస్తూ ఉండండి రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో అని ఊరించారు. అంటే ఆయన ప్రధాని ప్లేస్ లోకి వస్తారా అన్నది కూడా చర్చగా వస్తోంది.
అయితే మోడీ అమిత్ షా ఇద్దరూ ఒక్కటే మాట బాట కాబట్టి మోడీ వారసుడు ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అమిత్ షా అనే అంటారు. దాంతో మోడీ రిటైర్మెంట్ ఇపుడు గురుకు వస్తోంది. అమిత్ షా రిటైర్మెంట్ అని అన్నారు కానీ దాని కంటే ముందు మోడీ రిటైర్మెంట్ ఎపుడు అని ప్రశ్న వేసుకుంటే జవాబు కానీ తగిన విధంగా విశ్లేషణ కానీ వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీలో ప్రస్తుతం ఉక్కు మనిషిగా పేరున్న అమిత్ షా తన లక్ష్యాలను అన్నీ సాధించుకున్న మీదటనే వానప్రస్తాశ్రమం స్వీకరిస్తారు అని అంటున్నారు.
అంటే మోడీ నుంచి పగ్గాలు అందుకున్న తరువాతనే అన్న మాట. ఇక గుజరాత్ నుంచి మోడీ ప్రధాని అయ్యారు. మళ్ళీ అదే గుజరాత్ నుంచి రాబోయే కాలానికి కాబోయే ప్రధానిగా అమిత్ షా వస్తున్నారా అంటే ఇపుడున్న రాజకీయ వాతావరణం చూస్తే అది జరిగినా ఆశ్చర్యం లేదని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద ప్రధాని పీఠానికి అతి దగ్గరగా మాత్రం అమిత్ షా ఉన్నారు అన్నది నిస్సందేహం. ఎనీ డౌట్స్.