టీటీడీ పెర్ఫార్మెన్స్ పై అంబటి రాంబాబు ప్రశంసలు.. వీడియో వైరల్!
అవును... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డు ప్రసాదం నుంచి అన్నప్రసాద సౌకర్యాల నిర్వహణ వరకూ పలు ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే.;
నిజం చెబితే తప్పేముంది, వాస్తవాలు మాట్లాడాలి అనుకున్నారో.. లేక, తాజా పరిణామాల నేపథ్యంలో అలా మాట్లాడారో తెలియదు కానీ... కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ లో సుమారు 4 నిమిషాల వీడియోను విడుదల చేశారు.. తిరుమల అన్న ప్రసాదాల నిర్వహణపై ప్రశంసలు కురిపించారు.
అవును... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డు ప్రసాదం నుంచి అన్నప్రసాద సౌకర్యాల నిర్వహణ వరకూ పలు ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. ఇక లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం ఎంత వివాదాస్పదమైందనేది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారాయని అంటున్నారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి అంబటి తన స్వానుభవాన్ని పంచుకున్నారు.
తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో అన్నప్రసాదాలు బాగున్నాయని మాజీమంత్రి, వైసీపీ కీలక నేత కితాబిచ్చారు. ఇక్కడ భోజనం రుచిగా, శుచిగా ఉన్నట్లు తెలిపారు. నాణ్యమైన అన్నప్రసాదాలు భక్తులకు పెడుతున్నారని.. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో తిరుమలలో అన్న ప్రసాదం స్వీకరించినట్టు చెప్పారు.
వైసీపీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితులు, విశ్వసనీయ సహచరుల్లో ఒకరుగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ప్రశంసలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరహా ప్రశంసలు ఇప్పటికే స్వామివారి భక్తుల నుంచి వస్తున్నప్పటికీ.. అంబటి వ్యాఖ్యలు కచ్చితంగా ప్రత్యేకమనే చెప్పాలి.
భూమనకు ఇది బిగ్ షాకేనా?:
కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా దెబ్బ తిందని.. కొత్త ఛైర్మన్ వల్ల భక్తులకు ఒరిగిందేమీ లేదని.. భక్తులకు అందించిన ప్రత్యేక సేవలు అంటూ ఏమీ లేవని.. బీఆర్ నాయుడు ఏడాది పాలన, అసమర్థుని జీవన యాత్ర లాగా అమోఘంగా ఉందని.. చేతలకు చెల్లుచీటి, కోతలకు ధనుష్కోటి.. కన్యాశుల్కం గిరీశంకు తలదన్నే విధంగా కోతలు కోస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల ఘాటుగా ఫైరయిన సంగతి తెలిసిందే.
అయితే... తిరుమల తిరుపతి దేవస్థానం పెర్ఫార్మెన్స్ పై అన్నమంతా పట్టుకుని చూడనవసరం లేదు, ఒక మెతుకు పట్టుకున్నా చాలు అన్నట్లుగా.. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు భూమనకు బిగ్ షాకేనా అని అంటున్నారు నెటిజన్లు! ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా టీటీడీ ఎప్పుడూ పచ్చ తోరణం నిత్య కల్యాణంలా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు!