అమెజాన్ ఎండీకి అరెస్టు వారెంట్ జారీ.. కర్నూలు నుంచి ఎందుకు?

దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ ఎండీకి అరెస్టు వారెంట్ జారీ అయిన వైనం ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-10-23 06:57 GMT

దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ ఎండీకి అరెస్టు వారెంట్ జారీ అయిన వైనం ఆసక్తికరంగా మారింది. అందునా కర్నూలు నుంచి కావటం గమనార్హం. ఇంతకూ అమెజాన్ మేనేజింగ్ డైరెక్టర్ కు వారెంట్ జారీ చేసేంత తీవ్రమైన నేరం ఏం జరిగింది? ఇంతకూ వారెంట్ జారీ చేసిందెవరు? లాంటి అంశాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.దీనికి కారణం తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కర్నూలు జిల్లా సిబెళగల్ గ్రామానికి చెందిన వీరేశ్ గత ఏడాది (2024) 29న అమెజాన్ లో యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ సెల్ ఫోన్ ఆర్డర్ చేశారు. దీని కోసం ఆయన రూ.79,900 ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. అయితే.. సదరు వినియోగదారుడికి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఐఫోన్ 15 ప్లస్ కు బదులుగా ఐకూ నియో9ప్రో ఫోన్ అందింది. దీంతో అవాక్కైన అతను.. తాను ఆర్డర్ చేసిన ఫోన్ కు బదులుగా వేరే ఫోన్ రావటంపై కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.

దీంతో.. స్పందించిన కమిషన్ అమెజాన్ కంపెనీ ఎండీతో పాటు.. మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికి వారు కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీంతో.. ఐఫోన్ 15 ప్లస్ కోసం చెల్లించిన రూ.79,900తో పాటు.. దాని మీద పన్నెండు శాతం వడ్డీ కలిపి.. అతడికి ఎదురైన ఇబ్బందికి.. కోర్టు ఖర్చుల కింద మరో రూ.35వేలు చెల్లించాలని పేర్కొంది. ఇందుకోసం 45 రోజుల గడువును విధించింది.

అయితే.. జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని అమెజాన్ కంపెనీతో పాటు ప్రతివాదులు కమిషన్ ఆదేశాల్ని ఖాతరు చేయలేదు. దీంతో ఆగ్రహించిన కమిషన్ అమెజాన్ కంపెనీ ఎండీకి అరెస్టు వారెంట్లు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు తదుపరి విచారణను ఈ ఏడాది నవంబరు 21 నాటికి వాయిదా వేస్తూ కమిషన్ ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అమెజాన్ స్పందన ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News