రాజధానిలో మంటలు : 24 గంటల్లో గుర్తించడం సాధ్యమా?
రాజధాని అమరావతిలో నిర్మాణ సామగ్రి కాలిపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. హోంమంత్రి అనితతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారు.;
రాజధాని అమరావతిలో నిర్మాణ సామగ్రి కాలిపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. హోంమంత్రి అనితతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారు. 12 రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడాన్ని ‘కుట్ర’గా అనుమానిస్తున్నారు. రాజధాని పనులు అడ్డుకోడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? లేక ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సంఘటన జరిగేందుకు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఘటనకు కారణాలను తేల్చేందుకు ప్రభుత్వం విధించిన గడువుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజధాని అమరావతి ప్రాంతంలో రాయపూడి హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద సోమవారం రాత్రి రూ.8 కోట్ల విలువైన పైపులు కాలి బూడిదయ్యాయ. రాత్రి పూట జరిగిన ఈ ఘటనకు కారణాలు ఏంటి అనేది నిర్దిష్టంగా తెలియడం లేదని అంటున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో ఘటన జరగడం, కొద్దిసేపట్లోనే భారీ సంఖ్యలో పైపులు తగలిబడిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పెట్రోల్, కిరోసిన్, డీజిల్ లేదా ఇతర రసాయనాలను ఏమైనా వాడి పైపులను కాల్చేశారా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. అయితే ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం 24 గంటలు మాత్రమే గడువు విధించడం విమర్శలకు కారణమవుతోంది.
రాయపూడి ప్రమాదం జరగడానికి ముందు మార్చి 11 ఇలాంటి ప్రమాదమే అమరావతిలో జరిగింది. అప్పుడు కూడా భారీ సంఖ్యలో పైపులు కాలిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదం జరగడం అనుమానాలకు కారణమవుతోంది. అయితే మార్చి 11న సచివాలయానికి సమీపంలో వెలగపూడి వద్ద కూడా ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి. అప్పట్లోనే ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్ గా ఫోకస్ చేస్తే, రాయపూడి ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉండేది కాదని అంటున్నారు.
కోట్లాది రూపాయలతో పనులు జరుగుతున్న ప్రాంతంలో సరైన భద్రత లేని విషయం తాజా ఘటనతో వెలుగు చూస్తోంది. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుందని అంటున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో కనీసం సీ.సీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, పోలీసు పెట్రోలింగ్ వంటివి లేకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. దుర్ఘటనలు జరిగిన తర్వాత కుట్ర జరుగుతుందని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. అంతేకాకుండా ఆఘమేఘాలపై రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించడం తగదని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ఛేదించడం పోలీసులకు సవాల్ తో కూడుకున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. ఘటన ఎలా జరిగింది? అని తెలుసుకోడానికి ముందు ఆధారాలు సేకరించాల్సివుందని అంటున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చే నివేదికతో ప్రాథమిక అవగాహన వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి? పెట్రోల్, డీజిల్ లేదా ఇతర రసాయనాలు ఏవైనా వాడారా అనేది తెలుసుకోవాలంటే ఫోరెన్సిక్ రిపోర్టుపైనే ఆధారపడాల్సివుంటుందని అంటున్నారు. ఈ నివేదిక రావడానికి కనిష్టంగా 15 రోజులైనా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు.
కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం 24 గంటలే గడువు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆదరాబాదరాగా దర్యాప్తు చేయడం వల్ల విషయం పక్కదారి పట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులపై కుట్ర జరిగితే కచ్చితంగా శిక్షించాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది. అయితే కుట్ర అన్న అనుమానాలను నిజమని నిరూపించే ఆధారాలు సేకరించడమే అసలైన సవాల్ గా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం గడువు విధించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అనుభవం నుంచి పాఠం నేర్చుకుని నిర్మాణ పనులపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గమనించాలని సూచిస్తున్నారు.