'ఎట్ అమరావతి'.. అసెంబ్లీ తీర్మానంలో ఇదే పవర్ ఫుల్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృరించేలా కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది.;

Update: 2026-03-28 07:04 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృరించేలా కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది.. రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఈ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ప్రస్తుతం సభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అమరావతిని రాజధానిగా ఉంచడం అత్యవసరమని అభిప్రాయపడుతూ ప్రభుత్వం ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక తీర్మానానికి ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలకోపాన్యం చేశారు. కాగా, సభలో చారిత్రక తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో విపక్ష వైసీపీ సభ్యులు ఎవరూ సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

చట్టబద్ధతకు కీలక సవరణ

అమరావతిపై తీర్మానంలో అత్యంత ప్రధానమైన అంశం "ఎట్ అమరావతి" అనే పదం. 2014 రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సెక్షన్ 5(2)లో "ఎట్ అమరావతి" అనే పదాన్ని చేర్చడం ద్వారా రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన సందిగ్ధతలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ద్వారా ఏపీసీఆర్‌డీఏ చట్టం-2014 పరిధిలోని ప్రాంతాలను అమరావతిగా నిర్వచిస్తూ, దానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కేంద్రానికి ప్రతిపాదన

రాజధాని అమరావతికి పక్కా చట్టబద్ధత కల్పించేలా విభజన చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధానిపై స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజధాని నిర్మాణానికి దాని ఉనికికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు చేపట్టేలా ఈ తీర్మానాన్ని రూపొందించారు. అదేవిధంగా చట్టపరమైన చిక్కుముడులను విప్పడం ద్వారా రాష్ట్రంలో పరిపాలనా స్థిరత్వం, పెట్టుబడులకు భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులు వరుసగా మాట్లాడుతున్నారు. ముందుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ సభలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించారు. సెక్షన్–5 సవరణల ద్వారా రాజధాని హోదాను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక తీర్మానం అమరావతి భవితవ్యానికి ఒక బలమైన కవచంలా నిలవనుందని చెబుతున్నారు. ప్రధానంగా ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చాలని కోరడం ద్వారా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చే అవకాశం లేకుండా చట్టపరమైన భరోసా లభించినట్లైందని అంటున్నారు.

Tags:    

Similar News