ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. అందరూ తెలుసుకోవాల్సిన సమాచారం..
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని కూటమి సర్కారుకు వరుస ఆఫర్లు ఇస్తోంది.;
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని కూటమి సర్కారుకు వరుస ఆఫర్లు ఇస్తోంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మించనున్న రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు కలుపుతూ కొత్తగా ప్రతిపాదిస్తోంది.
దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతో రాజధాని అమరావతికి రోడ్డు, రైలు కనెక్టవిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రణాళికల్లో భాగంగా ముందుగా ఏపీ కేపిటల్ అమరావతిలో భారీ రైల్వేస్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు దక్షిణాదిలో నిర్మిస్తున్న రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏపీ రాజధాని నగరంతో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి మేరకు మైసూర్-చెన్నై కారిడార్ లో చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా నాయుడుపేటకు లింకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, దానిని కూడా తాజాగా ఆమోదించి మ్యాప్ లో చేర్చింది.
దీనివల్ల అమరావతి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి కారిడార్ ఏర్పాటు అవుతోందని అంటున్నారు. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారపేట, బెంగళూరు మాండ్య మీదుగా మైసూరుకు మరోకటి వస్తుంది. దేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ను కేంద్రం కొత్తగా మరికొన్ని హైస్పీడ్ రైల్ కారిడార్లను చేర్చింది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉపయోగించేలా 2 కారిడార్లను మంజూరు చేసింది.
ఇందులో ఒకటి హైదరాబాద్-శంషాబాద్-నల్గొండ-సూర్యాపేట-నందిగామ-అమరావతి/విజయవాడ, గుంటూరు, చీరాల, నాయుడుపేట మీదుగా చెన్నై వెళుతుంది. మరొకటి మైసూర్, మాండ్య, బెంగళూరు, బంగారుపేట, చిత్తూరు, అరక్కోణం-పూనమల్లె-చెన్నై. అయితే ఈ రెండు కారిడార్లలోనూ ఆధ్యాత్మిక నగరం తిరుపతి లేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించుకుని మైసూర్-చెన్నై రైలును చిత్తూరు మీదుగా తిరుపతి, నాయుడుపేట లింకు ప్రతిపాదించారు. నాయుడుపేట నుంచి అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్ ఎలైన్మెంట్ ఉన్న నేపథ్యంలో అమరావతికి ఇటు చెన్నై, అటు బెంగళూరు, మైసూరుతో కూడా కనెక్టవిటీ ఏర్పడుతుంది.
సీఎం ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉండటంతో కేంద్రం నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ చిత్రపటంలో చిత్తూరు-తిరుపతి-నాయుడుపేట లింకు చేర్చింది. వచ్చేఏడాది నాటికి వీటి డీపీఆర్ సిద్ధం చేసి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2029కి ముందే శంకుస్థాపనలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెబుతున్నారు.