బాబు గారు ఇక ఆపేయండి.. మండుతున్న అమరావతి రైతు!
రాజధాని అమరావతి నిర్మాణంపై గందరగోళం సృష్టించొద్దని ప్రభుత్వానికి అమరావతి రైతులు కోరుతున్నారు.;
రాజధాని అమరావతి నిర్మాణంపై గందరగోళం సృష్టించొద్దని ప్రభుత్వానికి అమరావతి రైతులు కోరుతున్నారు. అమరావతి కోసమంటూ తీసుకున్న 34 వేల ఎకరాల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి కనిపించకపోవగా, కొత్తగా మరో 44 వేల ఎకరాలు కావాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయానికి గురైన రైతులు.. కూటమి ప్రభుత్వంపై కొండంత ఆశ పెట్టుకుంటే ఇప్పుడు కూడా కాలయాపన చేసే ప్రణాళికలు మళ్లీ తెరపైకి తెస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రైతులు బహిరంగంగా మాట్లాడకపోయినా, రైతు నాయకుడు, మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు చేసిన విమర్శలు అమరావతి రైతుల అభిప్రాయమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని అమరావతిలో 34 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా సమకూర్చారు. 2014-19 మధ్య రాజధాని నిర్మాణానికి జరిగిన ప్రయత్నాలు కన్నా, ప్రచారమే ఎక్కువన్న విమర్శలను అప్పట్లో ఎదుర్కొన్నారు. అయితే నిధుల సమీకరణ, న్యాయ వివాదాలు, భూ సమీకరణ వంటి చిక్కుముడుల వల్ల అప్పట్లో తాత్కాలిక భవనాల నిర్మాణానికే ప్రభుత్వం పరిమితమైంది. ఇక 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారనే అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ఉంది. అయితే చంద్రబాబు 4.0 ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి రాజధాని నిర్మాణం దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. కానీ, వాస్తవంగా పనులు ఎక్కడా జరుగుతున్నట్లు కనిపించకపోవడంతో క్రమంగా అసంతృప్తి విస్తరిస్తోంది.
ఒకవైపు నిధులు సేకరణలో తలమునకలైన ప్రభుత్వం, మరోవైపు టెండర్ల ప్రక్రియను పది నెలలుగా కొనసాగిస్తోంది. ఇవి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్చి పనులు పట్టాలెక్కుతాయనే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పనులు మొదలు కాకముందే రాజధానికి 34 వేల ఎకరాలు సరిపోవని, ఇంకా 44 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తేవడం అమరావతి రైతులతోపాటు రాజధాని కోసం ఎదురుచూస్తున్న ప్రజలు నైరాశ్యంలోకి జారిపోతున్నారు. 34 వేల ఎకరాల్లో కనీసం వెయ్యి ఎకరాల్లో కూడా అభివృద్ధి పనులు జరగడం లేదని అంటున్నారు. రాజధాని భూముల్లో ప్రభుత్వ పరంగా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మాత్రమే నిర్మించాల్సివుంటుంది. అదేవిధంగా రోడ్లు, కాలువలకు కొంత భూమి అవసరం ఉంటుంది. ఇక భవిష్యత్తులో ఎప్పుడో అవసరమయ్యే మెట్రో, ఎయిర్ పోర్టు వంటి వాటి కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేయడమంటే అమరావతి నిర్మాణ పనులను మరింత ఆలస్యం చేయడమేనా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో చేసిన పొరపాటు వల్ల వైసీపీ ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతోందని అంటున్నారు. కానీ, కొత్తగా 44 వేల ఎకరాలు అంటూ ప్రభుత్వం అడుగులు వేస్తే, మొత్తం ప్రాజెక్టుకే కొర్రీ పడేలా ఆ పార్టీ వ్యవహరించొచ్చని రైతులు భయపడుతున్నారు. తమ బాధను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు చేయొచ్చు కదా? అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. మరో రెండుదశాబ్దాల తర్వాత అవసరమయ్యే వసతుల కోసం ఇప్పుడు ఆలోచించడాన్ని తన విజన్ గా చెప్పుకోవడంలో తప్పులేదు కానీ, ఇప్పుడు జరగాల్సిన పనులను ఆలస్యం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించాలని ప్రభుత్వానికి హితవు పలుకున్నారు.