అమరావతికి అధికారిక హోదా.. కేంద్రం లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధానిగా నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.;
ఏపీ రాజధాని అమరావతికి అన్ని రకాల చిక్కులు తొలగిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధానిగా నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని కేంద్రం అడుగులు వేస్తోందని అంటున్నారు. న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు త్వరలో లోక్ సభ ముందుకు రానుందని, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారని అంటున్నారు.
ఏపీ రాజధానిగా 2015లోనే రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై కేంద్రం గెజిట్ విడుదల చేయకపోవడంతో పలు రకాల సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. ఆయన వినతిపై కేంద్రం కూడా సానుకూలంగానే స్పందిస్తూ వచ్చింది. అయితే గత 18 నెలలుగా పార్లమెంటులో ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు.
ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రాజధాని రైతుల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన కేంద్రంతో చర్చించారని అంటున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా అమరావతిపై తక్షణం బిల్లు పెట్టాలని ఆదేశించడంతో ఈ డిసెంబరులో పార్లమెంటుకు అమరావతి బిల్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై పునఃసమీక్షించి సెక్షన్ 5లో అమరావతి రాజధానిగా చేర్చితే.. రాజధానికి అధికారిక గుర్తింపు వస్తుందని అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎవరూ రాజధానిని అమరావతి నుంచి కదపలేరని అంటున్నారు.
2015లో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఎక్కడా లేనట్లు రైతుల నుంచి 34 వేల ఎకరాలను భూమిని సమీకరించి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే కేంద్రం గెజిట్ లో రాజధానిగా అమరావతిని నోటిఫై చేయకపోవడం వల్ల 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిపై యూటర్న్ తీసుకుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దీంతో రాజధాని రైతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో గత ఎన్నికల్లో రాజధాని అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇక రైతులు కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధానిని తరలించకుండా చట్టం చేయాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై సీఎం ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు సీఎం ఒత్తిడి ఫలించి రాజధాని అమరావతికి అధికారిక హోదా ఇచ్చేలా అడుగులు పడుతున్నాయని అంటున్నారు.