అమరావతిలో 44 వేల ఎకరాల సేకరణకు మంత్రివర్గం ఆమోదం

అమరావతి రాజధానిలో రెండవ దశలో సేకరించనున్న దాదాపు 44 వేల ఎకరాల అంశానికి టీడీపీ కూటమి మంత్రివర్గం అమోద ముద్ర వేయనుందని తెలుస్తోంది.;

Update: 2025-06-04 03:47 GMT

అమరావతి రాజధానిలో రెండవ దశలో సేకరించనున్న దాదాపు 44 వేల ఎకరాల అంశానికి టీడీపీ కూటమి మంత్రివర్గం అమోద ముద్ర వేయనుందని తెలుస్తోంది. ఈ నెల 4న ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అయి అనేక కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది అని చెబుతున్నారు.

ఇక అమరావతిలో ఇప్పటికే 33 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అది జరిగి పదేళ్ళు దాటుతోంది, ఇపుడు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు తిరిగి మొదలవుతున్నాయి. గత నెలలో మోడీ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం అరవై వేల కోట్లతో వివిధ ఏజెన్సీల ద్వారా ఆర్ధిన వనరులు పెద్ద ఎత్తున సమకూరుస్తూ ఈ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఇక ఈ పనులను 2028 నాటికి పూర్తి అమరావతి రాజధాని తొలి దశ నిర్మాణాలను ఒక రూపునకు తీసుకుని వచ్చి జాతికి అంకితం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే అమరావతి రాజధానిని మరింతగా విస్తరించాలని భవిష్యత్తు అవసరాలకు అలాగే పెట్టుబడులకు అవసరమైన భూములను ఇవ్వడానికి కావాల్సినంత భూములను అందుబాటులో ఉంచుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది.

దాంతో ఈ భూముల సేకరణకు సంబంధించి మంత్రి నారాయణ తాజాగా ఒక కీలకమైన ప్రకటన చేశారు. మొత్తం 44 వేల ఎకరాలను సేకరిస్తామని అందులో అయిదు వేల ఎకరాలలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

ఇపుడు ఇదే అంశం మీద బుధవారం జరగనున్న మంత్రివర్గం కూలంకషంగా చర్చింది ఆమోదముద్ర వేస్తుంది అని అంటున్నారు. అంతే అమరావతిలో అయిదు వేల ఎకరాలలో అతి పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనకు కూడా పచ్చ జెండా ఊపనుంది అని అంటున్నారు.

అదే విధంగా అమరావతి రాజధానిలో నిర్మించే జీఏడీ టవర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు సైతం ఆమోదముద్ర వేయనుంది. హెచ్ఓడీకి సంబంధించి నాలుగు టవర్ల నిర్మాణానికి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

అలాగే అమరావతి రాజధానిలో రెండు వేల 500 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్పోర్ట్స్ కాంపెక్స్, మరో 2,500 ఎక‌రాల్లో స్మార్ట్ ఇండ‌స్ట్రీ హబ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వివిధ సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల‌కు సంబంధించి అమోదం తెల‌ప‌నుంది. మొత్తానికి చూస్తే ఈ కేబినెట్ లో అమరావతి రాజధానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. దాంతో పాటుగా తల్లికి వందనం పధకం అలాగే అన్నదాత సుఖీభవ పధకాలను ఎపుడు ప్రారంభించాలన్న దాని మీద నిర్ణయం తీసుకుంటారు.

Tags:    

Similar News