అమరావతి రాజధానికి తొలి శాశ్వతం
మరో వైపు చూస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక రూపు వచ్చేందుకు సీఆర్డీయే ప్రారంభం ఒక అవకాశంగా మారుతుందని అంటున్నారు.;
విభజన ఏపీకి రాజధాని లేదన్నది తెలిసిందే. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి రాజధానిని ప్రకటించారు. భారీ ఎత్తున భూ సేకరణ జరిగింది. ఏకంగా 33 వేల ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. 2019 నాటికి తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ హైకోర్టు వంటివి తయారయ్యాయి. ఈలోగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు, పైగా మూడు రాజధానులు అంటూ కొత్త నినాదం అందుకుంది. అలా అయిదేళ్ళూ కాలక్షేపం అయిపోయాయి. ఈసారి తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అమరావతి రాజధాని పనులు కూడా జోరందుకున్నాయి.
తొలి అడుగు పడినట్లేనా :
అమరావతిలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ సీఆర్డీయే కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అమరావతికి సంబంధించి ఇది తొలి శాశ్వత భవనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అమరావతిలో ఇప్పటికే కట్టడాలు కొన్ని ఉన్నా అవన్నీ తాత్కాలికమే అని గత ప్రభుత్వం చెప్పిన నేపథ్యం ఉందిఅధికారంలోకి వచ్చిన పదహారు నెలల వ్యవధిలోనే ఒక భారీ పర్మనెంట్ నిర్మాణం పూర్తి అయి ప్రారంభం కావడం మాత్రం ఒక విధంగా అమరావతి రాజధానికి సంబంధించి కీలక పరిణామంగానే చూస్తున్నారు. దాంతో ఈ విధంగా అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది అని అంటున్నారు.
రూపునకు వచ్చినట్లే :
మరో వైపు చూస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక రూపు వచ్చేందుకు సీఆర్డీయే ప్రారంభం ఒక అవకాశంగా మారుతుందని అంటున్నారు. ఇదే వరసలో రానున్న రోజులలో మరిన్ని శాశ్వత నిర్మాణాలు కూడా అమరావతిలో చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు కొత్త ఏడాది అంటే 2026 నాటికి అమరావతిలో ఉద్యోగుల భవనాలు కూడా పూర్తి అయి ప్రారంభానికి సిద్ధం అవుతాయని అంటున్నారు. అంటే 2026 మొదటికే అమరావాతిలో యాక్టివిటీ అయితే పెద్ద ఎత్తున మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
ధీమా పెరిగిందా :
ఇక అమరావతి రైతులలో ధీమా పెరిగింది అని అంటున్నారు ఎందుకంటే వారి భూములను తీసుకున్న తరువాత ఏమి జరిగింది అంటె ఆ మధ్య దాకా పెద్దగా ఎవరూ జవాబు చెప్పలేని పరిస్థితి. ఇపుడు మాత్రం వరసబెట్టి ప్రారంభోత్సవాలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అంతే కాదు ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని అమరావతి రాజధానిని సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు దిశా నిర్దేశం చేసింది. అంతే కాకుండా అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లకు అప్పగించారు ఆ తరువాత తాను కూడా రైతులతో సమావేశం అయి వారి సమస్యలు అనీ పరిష్కరిస్తాను అన్నారు. ఈ రకమైన భరోసా దొరకడంతో రైతులు కూడా ఆనందంగా ఉన్నారు.
హైలెట్ అయిన ఫోటో :
అమరావతిలో ఏముంది అన్న వారికి జవాబుగా చంద్రబాబు సీఆర్డీఏ భవనం ప్రారంభించిన అనంతరం ఆ భవనం ఎదురుగా ఫోటోని తీసుకున్నారు. అమరావతి రాజధాని ఇదిగో అభివృద్ధి ఇదిగో అని ఆయన అందరికీ తెలియచేస్తున్నట్లుగా ఈ ఫోటో ఉంది దంతో రానున్న రోజులలో అమరావతికి వెలుగులు రావడం తధ్యమని అంతా భావిస్తున్నారు.