‘అమరావతి’పై ఏం జరగనుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకటే చర్చ

ఒకవైపు వైసీపీ రాజధాని అమరావతి విషయంలో చేస్తున్న విమర్శలు నేపథ్యంలో సీఎం ఘాటుగా స్పందిస్తున్నారని అనుకున్నా, ఆయనతో కేంద్ర మంత్రులు వరుసగా భేటీ అవుతుండటం ఉత్కంఠకు కారణమవుతోంది.;

Update: 2026-01-26 03:15 GMT

రాజధాని అమరావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయా? అమరావతి శాశ్వతం అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన దేనికి సంకేతం.. ఒకపక్క బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం అమరావతి బిల్లు ప్రవేశపెడుతుందన్న ప్రచారం ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి విషయంలో చేస్తున్న ప్రకటనలు హీట్ పుట్టిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ రాజధాని అమరావతి విషయంలో చేస్తున్న విమర్శలు నేపథ్యంలో సీఎం ఘాటుగా స్పందిస్తున్నారని అనుకున్నా, ఆయనతో కేంద్ర మంత్రులు వరుసగా భేటీ అవుతుండటం ఉత్కంఠకు కారణమవుతోంది.

ఇప్పటివరకు ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ 2015లో ప్రకటన చేసింది. అయితే అప్పట్లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల అమరావతిని కేంద్రం గుర్తించలేకపోయిందని అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో చేసిన చట్టంలో హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ గడువు గత ఏడాది జూన్ 2వ తేదీ వరకు ఉంది. ఈ కారణంగానే గత ప్రభుత్వం అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రతిపాదన చేసిందని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనను గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదించారని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

ఇంతవరకు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతున్నా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారని అనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారిందని, ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అమరావతి బిల్లు తుది దశకు వచ్చేసిందని కేంద్రం సంకేతాలిస్తోందని అంటున్నారు.

అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ లో సీఎం చంద్రబాబును కలిసిన కేంద్రమంత్రి కీలక చర్చలు జరిపారని అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య రాజధాని అంశంపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఏమైందో కానీ, కేంద్ర మంత్రితో మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిపై తన గళం గట్టిగా వినిపించారని అంటున్నారు. రాజధానిని కదపడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు రైతుల త్యాగాలతో ఏర్పడిన రాజధానిని పటిష్ఠం చేస్తామని ప్రకటించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాజధాని పనులు శరవేగంగా పూర్తిచేస్తామని, అమరావతే ఏపీ శాశ్వత రాజధానిగా చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

అయితే చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ గత ఏడాది మేలో రాజధానిలో పర్యటించి అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇతోదికంగా నిధులు ఇస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని విషయంలో సీఎం గట్టిగా మాట్లాడటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గత పార్లమెంటు సమావేశాలు సందర్భంగా అమరావతి బిల్లు ప్రవేశపెట్టాల్సివుండగా, న్యాయశాఖ పరిశీలనలో ఆలస్యం కావడం వల్ల పార్లమెంటులో చర్చకు రాలేదని అంటున్నారు. ఇప్పుడు న్యాయశాఖ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు బిల్లు వెళ్లిందని అంటున్నారు. అక్కడ ఎటువంటి జాప్యం లేకుండా బిల్లును త్వరగా క్లియర్ చేసి కేంద్ర కేబినెట్ లో ఉంచాలని ఒత్తిడి చేసేందుకే సీఎం చంద్రబాబు అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు.

Tags:    

Similar News