అమరావతితో చెలగాటం....వైసీపీకి ప్రాణ సంకటమే !

అమరావతి రాజధాని ఏపీకి పూర్తి కావాలని అంతా కోరుకుంటున్నారు అని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.;

Update: 2025-08-19 21:30 GMT

ఒక రాష్ట్రానికి రాజధాని అతి ముఖ్యం. అది ఆత్మగా చెబుతారు. పూర్వకాలంలో చిన్న రాజ్యాలు పాలించిన రాజులు సైతం తమ రాజధాని అని ఫలానా ప్రాంతాన్ని ప్రకటించి అక్కడ నుంచే పాలించేవారు. ఆధునిక కాలంలోనూ రాజధానికి ఎంతో విలువ గౌరవం ఉంది. అయితే ఏపీ చేసుకున్న దురదృష్టం ఏమిటి అంటే ఈ రోజుకీ రాజధాని అంటూ లేకపోవడం. అయితే ఆ కొరతను అమరావతి తీరుస్తుందని అత్యధిక శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఒక విధంగా చూస్తే కనుక అమరావతి ఏపీ ప్రజల సెంటిమెంట్ గా మారింది.

పుట్టె ముంచింది కదా :

ఏపీకి రాజధానిగా అమరావతి ఉండాలని 2014 నుంచి 2019 మధ్యన అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినపుడు వైసీపీ కూడా అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చింది అని అంతా గుర్తు చేస్తున్నారు అయితే వైసీపీ ఆ తరువాత వివిధ కారణాలతో వ్యతిరేకిస్తూ వచ్చింది. అమరావతి కనుక పూర్తి అయితే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందో అన్న ఆలోచన వల్ల కూడా వ్యతిరేకిస్తున్నారు అని రాజకీయ విశ్లేషణలు సైతం ఉన్నాయని చెబుతారు. అయితే ఒక్కో పాలకులకు ఒక్కోటి బ్రాండ్ ఇమేజ్ గా ఉంటుంది కావాలీ అంటే వైసీపీ కూడా తన హయాంలో అలాంటి ఐకానిక్ నిర్మాణాలను చేపట్టి జనంలో పేరు తెచ్చుకోవచ్చు. కానీ రాజధాని అన్నది ఏడు దశాబ్దాల కలగా ఉన్న ఏపీ జనాల సెంటి మెంట్ తోనే పాలిటిక్స్ చేయకూడదు అన్నది 2024 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. దాంతో వైసీపీ రాజకీయంగా పుట్టె మునిగినట్లు అయింది అని చెబుతారు.

ఇంత జరిగినా కూడా :

చిత్రమేంటి అంటే వైసీపీకి 2024 ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. విపక్ష హోదా సైతం దక్కలేదు. ఒక విధంగా అమరావతి రాజధాని సెంటిమెంట్ కూడా బాగా పనిచేసింది అన్నది ఈ ఫలితాలను అధ్యయనం చేసిన వారు చెప్పిన విశ్లేషణ. మూడు రాజధానుల విషయంలో వైసీపీ నినాదాలే తప్ప విధానాలు లేవని కూడా జనాలు అర్ధం చేసుకునే తీర్పు గట్టిగా ఇచ్చారు అని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో తమకు దక్కిన భారీ ఓటమి మీద వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అమరావతి రాజధాని విషయంలో మద్దతు సంగతి పక్కన పెడితే మౌనంగా ఉన్నా సరైన వ్యూహమే అవుతుంది అన్నది వైసీపీ గ్రహించడం లేదా అని అంటున్నారు.

ఎదురు తన్నుతుందన్న సోయి లేదా :

అమరావతి రాజధాని ఏపీకి పూర్తి కావాలని అంతా కోరుకుంటున్నారు అని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకే ఇబ్బందిగా మారుతాయని అంటున్నారు పులస చేపలు అమరావతిలో పట్టుకోవచ్చు అని ఆయన సెటైరికల్ గా చేస్తున్న కామెంట్స్ వల్ల వైసీపీకే రాజకీయ నష్టం అంటున్నారు. వర్షాలు అన్ని చోట్లా పడుతున్నాయి. ముంబై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ ఇలా రాజధానులు ఎక్కడ ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు. అంతమాత్రం చేత రాజధానుల మీద విమర్శలు చేయడం లేదు కదా అంటున్నారు. అమరావతి విషయంలో విమర్శలు చేస్తూ పోతే అది అంతిమంగా వైసీపీకే చేటు తెస్తుందని అంటున్నారు.

క్లారిటీ మిస్ అవుతోందా :

ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం. అది ఇపుడు నిర్మాణంలో ఉంది. ఆరు నూరు అయినా అమరావతి రాజధాని అయితే అక్కడ నుంచి కదిలేది లేదు. కాస్తా ముందూ వెనకా అయినా నిర్మాణం జరిగి తీరుతుంది. అలాటప్పుడు ప్రజల సెంటిమెంట్ ని గుర్తు ఎరిగి రాజధానికి మద్దతుగా వ్యవహరించాలి. అవసరం అయితే నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలి. అంతే తప్ప ఫక్తు వ్యతిరేకంగా తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకునేలా పార్టీ నాయకులు ఇచ్చే ప్రకటనల వల్ల వైసీపీకే నష్టం అంటున్నారు. ఇప్పటికైనా అమరావతి విషయంలో వైసీపీ ఒక క్లారిటీతో ముందుకు వస్తేనే రాజకీయంగా మేలు అని చెబుతున్న వారు పార్టీ లోపలా బయటా ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News