ఇస్లాంను ఫాలో అయ్యే వ్యక్తి భార్య బతికి ఉండగా సహజీవన హక్కు ఉండదు

తన భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తితో కలిసి ఉండటాన్ని ముస్లిం వివాహ చట్టం అనుమతించదని స్పష్టం చేసింది.

Update: 2024-05-10 06:36 GMT

కీలక అంశాన్ని సూటిగా.. స్పష్టంగా తేల్చి చెప్పింది అలహాబాద్ హైకోర్టు. ఇస్లాం మతాన్ని అనుసరించే భర్త.. తన భార్య బతికి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని పేర్కొంది. తన భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తితో కలిసి ఉండటాన్ని ముస్లిం వివాహ చట్టం అనుమతించదని స్పష్టం చేసింది. తాను సహజీవనం చేసే వ్యక్తికి చెందిన మహిళ (భార్య).. వారి కుటుంబం నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ స్నేహాదేవి అనే మహిళ.. స్నేహాదేవితో సహజీవనం చేస్తున్న మహద్ షాదాబ్ ఖాన్ లు కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం విచారించింది. 2020లో ఫరీదా ఖాతూన్ అనే మహిళను షాదాబ్ అనే వ్యక్తి పెళ్లాడారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా ఫరీదా తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే.. ఆమె భర్త మాత్రం స్నేహాదేవి అనే మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్నేహాదేవి కుటుంబ సభ్యులు మాత్రం షాదాబ్ ఆమెను కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. ఈ వ్యవహారంపై కోర్టుకు హాజరైన మహద్ షాదాబ్.. స్నేహాదేవిలు తమ ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటున్నట్లుగా పేర్కొన్నారు. తనపై నమోదైన కిడ్నాప్ కేసును కొట్టేయాలని.. తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు ఆర్టికల్ 21 ప్రకారం ఈ కేసులో ఎలాంటి రక్షణను కల్పించలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. భార్య బతికి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కను ఇస్లాం అనుసరించే వ్యక్తి పొందలేరని పేర్కొంది. స్నేహాదేవిని ఆమె కుటుంబ సభ్యులకు భద్రత మధ్య అప్పగించాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News