పహల్గాం దాడి.. మొదటి బాధితురాలు నేనే.. ఇండియన్ ఐడల్ 16 స్టేజ్ పై కన్నీళ్లు!
ఆమె మాట్లాడుతూ.. "వివాహమైన కొత్తలో ఎంతో ఉత్సాహంగా పహల్గాం అందాలను చూసేందుకు వెళ్లిన మా జంటకు అది ఆఖరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు.;
జీవితం అంటే ఎన్నో ఆశలు, మరెన్నో కలలు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఒక నిమిషం చాలు సర్వస్వం కోల్పోవడానికి. పహల్గాం ఉగ్రదాడిలో తన సర్వస్వాన్ని కోల్పోయిన ఐశన్య ద్వివేది గాథ వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. పెళ్లయిన రెండు నెలలకే పసుపు కుంకుమలు తుడిచిపెట్టుకుపోయినా, ఆమె కళ్లలో భర్తను కోల్పోయిన బాధతో పాటు, దేశం తీర్చుకున్న ప్రతీకారం పట్ల ఒక గర్వం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఇండియన్ ఐడల్ 16 స్టేజ్ పై ఆ వీరనారి చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి భారతీయుడి గుండెను తడుతున్నాయి.
ఆమె మాట్లాడుతూ.. "వివాహమైన కొత్తలో ఎంతో ఉత్సాహంగా పహల్గాం అందాలను చూసేందుకు వెళ్లిన మా జంటకు అది ఆఖరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడిలో ఉగ్రవాదులు అతి క్రూరంగా కాల్పులు జరిపారు. ఆ రోజు వారు మొదట బలి తీసుకుంది నా భర్త శుభమ్ నే " అని ఐశన్య కన్నీటి పర్యంతమవ్వడం చూస్తుంటే ఆ భయానక దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. కేవలం రెండు నెలల వైవాహిక బంధం.. ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉండగానే, 26 మంది భారతీయుల ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్న ఆ రోజు భారత చరిత్రలో ఒక నల్లని రోజుగా మిగిలిపోయింది. ఆ చేదు జ్ఞాపకం ఐశన్య జీవితంలో ఎప్పటికీ పూడ్చలేని లోటును మిగిల్చింది.
ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన దుఃఖం ఒకవైపు ఉన్నా, భారత సైన్యం చూపిన తెగువ ఐశన్యకు కొండంత అండగా నిలిచింది. తన భర్తను, తోటి భారతీయులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను మన సైన్యం వేటాడి మరీ అంతం చేయడం ఆమెకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. "నా భర్తను చంపిన వారికి మన సైన్యం సరైన గుణపాఠం చెప్పింది, అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను" అని ఆమె చెప్పిన మాటలు దేశభక్తికి నిదర్శనం. ఒక సామాన్య మహిళగా పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా, దేశ గౌరవం గురించి ఆలోచించడం ఆమెలోని గొప్పతనాన్ని చాటిచెబుతోంది. ఈ ప్రతీకారం కేవలం ఐశన్య కుటుంబానికే కాదు, యావత్ దేశానికి ఒక భరోసాను ఇచ్చింది.
ఐశన్య ద్వివేది వంటి వారు మన దేశానికి నిజమైన స్ఫూర్తి ప్రదాతలు. ప్రియమైన వారిని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకుని, దేశం కోసం పోరాడే సైన్యం పట్ల కృతజ్ఞత చూపడం సామాన్యమైన విషయం కాదు. ఆమె కన్నీరు ఉగ్రవాదంపై మనకున్న ఆగ్రహాన్ని పెంచితే, ఆమెలోని గర్వం మన సైన్యం పట్ల గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు ఆత్మశాంతి కలగాలని, ఐశన్య వంటి వారికి ఆ దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.