ఫ్లైట్ జర్నీలో బ్లాక్ కలర్ సాక్స్ వేసుకోకూడదా?
విమాన ప్రయాణాల వేళ.. వీలైనంతవరకు రిలాక్స్ గా ఉండే దుస్తులు ధరించేందుకు చాలామంది ఇష్టపడతారు.
విమాన ప్రయాణాల వేళ.. వీలైనంతవరకు రిలాక్స్ గా ఉండే దుస్తులు ధరించేందుకు చాలామంది ఇష్టపడతారు. మరికొందరు మాత్రం.. చాలా పక్కాగా ప్రిపేర్ అయి రావటం కనిపిస్తుంది. విదేశాల్లోని ప్రయాణికుల్ని చూసినప్పుడు విమాన ప్రయాణాల వేళ.. వారు వీలైనంతగా రిలాక్స్ వేర్ ను ధరించటం కనిపిస్తుంది. అదే సమయంలో చలిని తట్టుకునేలా జాకెట్లు.. హుడీలు ధరిస్తుంటారు.
అయితే.. విమాన ప్రయాణాల వేళ.. కాళ్లకు ధరించే సాక్స్ కు సంబంధించి నల్లరంగు సాక్స్ ధరించటం సరికాదన్న మాట వినిపిస్తోంది. అందులో నిజమెంత? దీనికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. విమాన ప్రయాణంలో అనుకోని సమస్యలకు నల్లరంగు సాక్స్ కారణమవుతాయా? అంటే.. అవుననే మాటను పలువురి నోటి నుంచి వినిపిస్తుంటుంది.
రోజుల్లో ముఖ్యంగా రాత్రిళ్లు ప్రయాణించే వేళలో.. నల్లరంగు సాక్స్ ధరించటం సరికాదని చెబుతారు. దీనికి కారణం రాత్రి ప్రయాణాల్లో క్యాబిన్ లైటింగ్ తక్కువగా ఉండటం తెలిసిందే. ఈ సమయంలో బ్లాక్ సాక్స్ విమానపరిసరాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు.. రాత్రి వేళ ప్రయాణం చేసినప్పుడు షూస్ తీసేసి.. కాళ్లను ముందుకు చాచే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలాంటప్పుడు వారు ధరించే బ్లాక్ సాక్స్ చీకట్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. అలాంటి వేళలో.. క్యాబిన్ సిబ్బంది తమ సర్వీస్ లో భాగంగా అటుఇటు తిరుగుతుంటారు. అలాంటప్పుడు ప్రయాణికుల పాదాలు బ్లాక్ సాక్స్ తో కవర్ కావటంతో.. వాటిని తొక్కుప్రమాదం ఉంటుంది.
అంతేకాదు..కొన్నిసార్లు సర్వీస్ ట్రాలీలు సైతం కాళ్లను ఢీ కొట్టే ప్రమాదం పొంచి ఉంది. చూసేందుకుచిన్న విషయంగా అనిపించినా.. తరచూ ట్రావెల్ చేసే వారితో పాటు.. వెకేషన్ కోసం ట్రావెల్ చేసే వారు.. తమ జర్నీ మూడ్ ను డిస్ట్రబ్ చేసే అంశాలకు దూరంగా ఉండటం అవసరం. మరో అంశం ఏమంటే.. విమానాల ప్లోరింగ్ మీద వివిధ రకాల బ్యాక్టీరియా.. వైరస్ లు ఎక్కువ కాలం జీవించి ఉంటాయని చెబుతుంటారు. అందుకే షూస్ తీసేసి.. సాక్స్ తో నేలపై నడవటం ఆరోగ్యపరంగా సరికాదంటున్నారు. అందుకే వైట్ లేదంటే గ్రే లేదంటే లేత రంగుల సాక్స్ ను ధరించటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.