ఎయిరిండియా క్రాష్ రిపోర్ట్... సాఫ్ట్ వేర్, టీసీఎంఏ ప్రస్థావన ఏది?

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787 విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికను ఇటీవల ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-17 18:30 GMT

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787 విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికను ఇటీవల ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై పైలెట్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. మరోవైపు, కాక్‌ పిట్‌ లో రికార్డైన సంభాషణల నివేదిక తెరపైకి రావడంతో వేళ్లన్నీ పైలెట్ల వైపు చూపిస్తున్నాయని అంటున్నారు!

ఇంధన స్విచ్‌ ఎందుకు ఆపావంటూ ఒక పైలెట్ అడగడం.. తాను ఆపలేదని మరో పైలెట్ సమాధానం చెప్పడంతో ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ కు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది కానీ అహ్మదాబాద్ నుంచి లండన్‌ కు వెళ్తుండగా ఎందుకు రెండు స్విచ్‌ లు ఆగిపోయాయనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగానే ఇంధన స్విచ్‌ లు ఆపేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఇంధన స్విచ్ రన్ నుంచి కటాఫ్ కు ఎందుకు మారిందో నివేదికలో ప్రస్తావించలేని పరిస్థితి!! ఈ నేపథ్యంలో.. అమెరికా విమానయాన నిపుణురాలు మేరీ షియావో స్పందించారు. పైలట్ లపై అనుమానాల వాదనను ఆమె తిరస్కరించారు.

అవును... అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో పైలెట్లపై పలు అనుమానాల వాదనలు తెరపైకి వస్తోన్న వేళ.. మేరీ షియావోను మీడియా సంప్రదించగా... దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని ఆమె వెల్లడించారు. కాక్ పీట్ వాయిస్ రికార్డర్ లో ఉన్న వాయిస్ లను, చిన్న చిన్న శబ్ధాలను సైతం జాగ్రత్తగా విశ్లేషించాలని తెలిపారు.

పైలట్ ఆత్మహత్య లేదా హత్య అని సూచించడానికి ఇక్కడ ఎలాంటి ఆధారం లేదని ఆమె నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే... ఇంధన స్విచ్ "రన్" నుండి "కటాఫ్" కు దానంతట అదే మారడం ఇదే మొదటిసారి కాదని షియావో ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ కి చెప్పారని నివేదించబడింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఘటన తెరపైకి వచ్చింది.

ఈ సందర్భంగా స్పందించిన షియావో... 2019లో ఒక ఆల్ నిప్పాన్ ఎయిర్‌ వేస్ కు చెందిన బోయింగ్ 787 విమానం నేలపై ఉందని భావించేలా సాఫ్ట్ వేర్ చేసిందని.. దీంతో థ్రస్ట్ కంట్రోల్ మాల్‌ ఫంక్షన్ అకామడేషన్ సిస్టమ్ ఇంజిన్‌ లకు ఇంధనాన్ని కట్ చేసిందని దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇదే సమయంలో.. పైలట్లు ఎప్పుడూ ఇంధన కటాఫ్‌ ను తాకలేదని ఆమె జోడించారు.

టోక్యో నుండి ఒసాకాకు బయలుదేరిన ఆ ‘ఆల్ నిప్పాన్ ఎయిర్‌ వేస్’ (ఏఎన్ఏ) విమానంలో 109 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే... బోయింగ్ 787 విమానంలో రెండు ఇంజిన్లు ఉండగా... ఒకే ఇంజిన్‌ తోనూ ప్రయాణించగలదని.. అయినప్పటికీ ఎయిరిండియా విషయంలో రెండు ఇంజన్లు ఒకేసారి విఫలమయ్యాయని షియావో అన్నారు!

ఇదే సమయంలో... ప్రాథమిక నివేదిక పైలట్లపై నింద మోపబడినట్లు ఉన్నప్పటికీ.. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలు చర్చకు రావాలని ఆమె కోరారు! ఏఏఐబీ నివేదికలో థ్రస్ట్ కంట్రోల్ మాల్ ఫంక్షన్ అకామిడేషన్ (టీసీఎంఏ) గురించి ప్రస్థావించలేదని.. దర్యాప్తులో ఇది కూడా చర్చకు రావాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. సాఫ్ట్ వేర్ కు క్లీన్ చీట్ ఇవ్వలేదని తెలిపారు!

Tags:    

Similar News