నిప్పు ముట్టుకుంటే చల్లగా.. మంచు తాకితే మంటగా... యువకుడికి వింత వ్యాధి
మంటను తాకితే కాలుతుంది..మంచును ముట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది.;

మంటను తాకితే కాలుతుంది..మంచును ముట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది. ఇది ఎవరికి అయినా కామన్ కానీ. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడికి మాత్రం ఇందుకు కంప్లీట్ డిఫరెంటుగా జరుగుతోంది. అతనికి నిప్పు ముట్టుకుంటే చల్లగా అనిపిస్తే, చల్లని పదార్థాలు మాత్రం భగభగమండే మంటలా చురుక్కుమంటాయి. ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఆ యువకుడు మాత్రం గత ఐదేళ్లుగా దీనితో నరకయాతన అనుభవిస్తున్నాడు. అతని కాళ్లు, చేతులు స్పర్శను కోల్పోయాయి. ఎన్నో హెల్త్ టెస్టులు చేసినా ఇది ఏమి వ్యాదో నిర్దారణ అయింది కానీ దానికి మాత్రం సరైన చికిత్స మాత్రం ఇప్పటికీ లేదు.
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల ఎయిడెన్ మెక్‌మానస్‌కు ఈ సమస్య 17 ఏళ్ల వయస్సులో నుంచే మొదలైంది. హైస్కూల్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు మొదలైంది. మొదట్లో అతని పాదాల్లో కొద్దికొద్దిగా స్పర్శ కోల్పోవడం ప్రారంభమైంది. పాదాలు తిమ్మిరెక్కడం, చక్కిలిగింతలు పెట్టినట్లుగా అనిపించడం మొదలైంది. పాదాల్లోకి రక్త సరఫరా సరిగా లేదని డాక్టర్లు మందులిచ్చారు. కానీ, అవేవీ పనిచేయలేదు. నడవడమే కష్టంగా మారడంతో న్యూరాలజిస్టులు 20కి పైగా బ్లాడ్ టెస్టులు చేశారు. బయాప్సీ కూడా చేసినా వ్యాధి ఏమిటో సరిగ్గా నిర్దారణ చేయలేకపోయారు. చివరికి వైద్యులు అతను ఆక్సోనల్ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్నాడని నిర్ధారించారు. ఈ వ్యాధి శరీరానికి సిగ్నల్స్ ప్రసారం చేయకుండా నాడీ కణాలను అడ్డుకుంటుంది.
దాంతో తన కుమారుడు వేడిగా ఏదైనా తీసుకుంటే చల్లగా అనిపిస్తుందని, చల్లగా ఉన్నప్పుడు మండుతున్న ఎక్స్ పీరియన్స్ పొందుతాడని అతని తల్లి ఏంజిలా మెక్‌మానస్ ఆవేదన వ్యక్తం చేసింది. అతని పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. నడవగలిగే సామర్థ్యం, కాళ్లు, చేతుల్లో సమన్వయం క్రమంగా తగ్గిపోతున్నాయి. నయం చేయలేని ఈ వ్యాధికి చికిత్స చాలా ఖరీదైనదని, దానిని భరించలేమని నేషనల్ డిజేబిలిటీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ (ఎన్‌డీఐఏ) కూడా చేతులెత్తేసింది. చికిత్స ఏమిటో తెలియకుండా నిధులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నొప్పి నివారణ మందులు తప్ప అతనికి అందుబాటులో వేరే చికిత్స లేదని న్యూరాలజిస్ట్ స్పష్టం చేశాడు. పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తున్నందున ఎన్‌డీఐఏలో చేర్చాలంటూ అతని తల్లి ఆ ఏజెన్సీకి లేఖ రాసింది.