'ఎయిరిండియా ప్రమాదంలో కుట్రకోణం'పై కేంద్రం కీలక వ్యాఖ్యలు!

ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోన్న సంగతీ తెలిసిందే. ఈ సమయంలో స్పందించిన మురళీధర్‌ మోహోల్‌.. ఈ కేసులోని కుట్ర కోణంపై కూడా దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.;

Update: 2025-06-29 18:45 GMT

అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 260 మంది మరణించినట్లు తాజాగా అధికారులు నిర్ధారించారు. ఈ సమయంలో... ఈ ఘోర ప్రమాదం కేసులో కుట్ర కోణంపై కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం జూన్ 12న ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోన్న సంగతీ తెలిసిందే. ఈ సమయంలో స్పందించిన మురళీధర్‌ మోహోల్‌.. ఈ కేసులోని కుట్ర కోణంపై కూడా దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన మురళీధర్‌ మోహోల్‌... ఆ విషాద ఘటనపై ఏఏఐబీ పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించిందని.. అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో... ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఏదైనా ఉందా..? అనే అంశంపై కూడా దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి పలు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో చాలా ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పిన మురళీధర్ మోహోల్... రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలం అవ్వడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదని.. ఇది అత్యంత అరుదైన కేసు అని.. పూర్తి దర్యాప్తు నివేదిక వస్తే గానీ ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం లేదని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... బ్లాక్ బాక్స్ ను విదేశాలకు పంపనున్నారనే ప్రచారాన్ని మురళీధర్ కొట్టిపారేశారు. ఆ బ్లాక్ బాక్స్ పై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. దేశంలో వాడుతున్న 33 డ్రీమ్‌ లైనర్‌ విమానాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారని తెలిపారు.

కాగా.. ఇటీవల బ్లాక్ బాక్స్ డేటాను ఏఏఐబీ ల్యాబ్‌ లో డౌన్‌ లోడ్‌ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కాక్‌ పిట్‌ వాయిస్‌ రికార్డర్‌, ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ లో ఉన్న డేటా అనాలసిస్ కొనసాగుతోందని.. దీంతో ప్రమాదానికి ముందు ఏమి జరిగిందో తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపింది.

Tags:    

Similar News