పాక్ సైనికుల ప్యాంటులను వేలాడదీసిన తాలిబన్లు.. తెరపైకి కీలక ప్రతిజ్ఞ!

బుధవారం ఉదయం నుంచి సరిహద్దులో వివాదం మరింత ప్రమాదకరంగా మారడంతో.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌ కు వ్యతిరేకంగా ఇస్లామిక్ ఎమిరేట్ యోధుల వెనుక ఆఫ్గన్లు ర్యాలీ చేశారు.;

Update: 2025-10-15 16:54 GMT

పాకిస్థాన్ ను ఆఫ్గాన్ సైన్యం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేయడంతో, వారి అభ్యర్థన మేరకో, మధ్యవర్తుల ఒత్తిళ్ల మేరకో తెలియదు కానీ ఇరుదేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం సాయంత్రం 6:00 గంటల నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే! అంతకంటే మందు ఆఫ్గాన్ వీధుల్లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది.. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

అవును... బుధవారం కాబూల్, కాందహార్‌ లలో పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించడంతో పాటు సుమారు 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారనే కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎదురుదాడిలో స్పిన్ బోల్డాక్‌ లోని సరిహద్దు అవుట్‌ పోస్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో పోస్టులను వదిలిపెట్టిన పాకిస్తాన్ సైనికుల ప్యాంటుల వ్యవహారం ఆసక్తిగా మారింది.

ఈ సందర్భంగా... డ్యురాండ్ లైన్ సమీపంలోని పాకిస్తాన్ సైన్యం వదిలివేయబడిన సైనిక పోస్టుల నుండి స్వాధీనం చేసుకున్న ఖాళీ ప్యాంటులను ఆఫ్గనిస్తాన్‌ లోని తూర్పు నాన్‌ గ్రాహార్ ప్రావిన్స్‌ లో ప్రదర్శించారని ఆఫ్గన్ జర్నలిస్ట్ దౌద్ జున్‌ బిష్ వెల్లడించారు. ఈ సమయంలో ఎదురుదాడి తర్వాత పాక్ సైన్యం పారిపోయిన సరిహద్దు అవుట్‌ పోస్టుల నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంటు, ఆయుధాలను ప్రదర్శించే చిత్రాన్ని ఆయన పంచుకున్నారు.

ఆఫ్గన్ల కీలక ప్రతిజ్ఞ!:

బుధవారం ఉదయం నుంచి సరిహద్దులో వివాదం మరింత ప్రమాదకరంగా మారడంతో.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌ కు వ్యతిరేకంగా ఇస్లామిక్ ఎమిరేట్ యోధుల వెనుక ఆఫ్గన్లు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా.. అవసరమైతే తాము యుద్ధభూమిలో ముజాహిదీన్, ఇస్లామిక్ ఎమిరేట్ సైన్యంతో కూడా చేరుతామని కాందహార్ నివాసి చెప్పినట్లు స్థానిక మీడియా నివేధించింది.

తాలిబన్ల వెనుక ఆఫ్గన్లు!:

బుధవారం పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత ఆఫ్గన్లు తాలిబాన్లుగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన వారు.. ఇస్లామిక్ ఎమిరేట్ ఎవరితోనూ ఘర్షణను కోరుకోదు కానీ.. పాకిస్తాన్ మనల్ని అణచివేస్తూనే ఉంది అని అంటూ.. తాము ఇస్లామిక్ ఎమిరేట్‌ ను, తమ దేశాన్ని రక్షించుకుంటామని.. తమ మాతృభూమిలో జోక్యం చేసుకునే హక్కు ఏ విదేశీయుడికి లేదని అన్నారు.

200 మందికి పైగా మృతి!:

గత వారం కాబూల్‌ లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) శిబిరాలను ఇస్లామాబాద్ లక్ష్యంగా చేసుకున్న తర్వాత సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ వాతావారణం మొదలైన సంగతి తెలిసిందే. తాలిబాన్ పాలనలోని ఆఫ్గన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ సమయంలో... సరిహద్దు సంఘర్షణకు, ఆఫ్గనిస్తాన్ గగనతలాన్ని పదేపదే ఉల్లంఘించడానికి పాకిస్తాన్ కారణమని ఆఫ్గన్లు ఆరోపించారు. ఇదే సమయంలో.. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు భారీగా ప్రాణనష్టం కలిగించుకున్నట్లు ప్రకటించుకున్నాయి. ఈ సందర్భంగా... ఆఫ్గన్ తాలిబన్లు, వారి మిత్రదేశాలకు చెందిన 200 మందికి పైగా యోధులను చంపినట్లు పాకిస్తాన్ చెప్పగా.. 58 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లు ఆఫ్గనిస్తాన్ చెప్పిందని రాయిటర్స్ నివేదించింది!

Tags:    

Similar News