ఆదాయంలో ‘సైకిల్’ రికార్డు.. ఖర్చులో 'ఫ్యాన్' ఫస్ట్

దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు జాతీయ స్థాయిలో అగ్రస్థానాల్లో నిలవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Update: 2026-05-29 06:03 GMT

దేశంలో రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయ లెక్కల్లో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధిక ఆదాయం వచ్చిన ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో ఎక్కువ ఖర్చు పెట్టిన పార్టీగా వైసీపీ నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఆర్థిక పరిస్థితిపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ADR) సంస్థ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు జాతీయ స్థాయిలో అగ్రస్థానాల్లో నిలవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక ఆదాయం గడించిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం సరికొత్త రికార్డు సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా అడుగులు వేసిన టీడీపీ ఏకంగా రూ.228.31 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా అవతరించిందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. టీడీపీ తర్వాత పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ రూ. 219 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూ.140 కోట్ల ఆదాయంతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ఆదాయం ఒకెత్తయితే.. ఎన్నికల వేళ జనాల్లోకి వెళ్లేందుకు పార్టీలు చేసిన ఖర్చులు మరో ఎత్తు. ఈ వ్యయాల విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. 2024-25లో వైసీపీ ఏకంగా రూ. 340.20 కోట్లు ఖర్చు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తమకు వచ్చిన ఆదాయం రూ. 140 కోట్లు అయితే.. అంతకంటే దాదాపు రెట్టింపు మొత్తాన్ని పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టిందని ఏడీఆర్ నివేదిక తేల్చింది. వైసీపీ తర్వాత ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ రెండో స్థానంలో, తృణమూల్ కాంగ్రెస్ మూడో స్థానంలో ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ పాత-కొత్త లెక్కల మధ్య స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రాంతీయ పార్టీల ఆదాయ వనరులు పరిమితంగా, స్థిరంగా ఉండేవి. కానీ ఎన్నికల సంవత్సరమైన 2024-25లో కార్పొరేట్ నిధులు, భారీ విరాళాలతో పార్టీలకు నిధుల వరద పారిందని విశ్లేషిస్తున్నారు. గతంలో చాలా పార్టీలు తమకు వచ్చిన ఆదాయంలోనే పొదుపుగా ఖర్చు చేస్తూ, మిగిలిన మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవి. కానీ ఈసారి గెలుపే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవడంతో, రాబడిని మించి భారీగా వ్యయం చేశాయని అంటున్నారు.

దేశంలో మొత్తం 67 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉండగా.. అందులో కేవలం 36 పార్టీలు మాత్రమే నిర్ణీత గడువులోగా తమ ఆడిట్ నివేదికలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి. వీటిని ఆధారంగా చేసుకునే ఏడీఆర్ నివేదిక రూపొందించినట్లు వెల్లడించింది. ఇంకా 31 పార్టీలు తమ అధికారిక లెక్కలను అప్పగించాల్సి ఉందని అంటున్నారు. మిగిలిన పార్టీల లెక్కలు కూడా వస్తే ఈ గణాంకాల్లో మరికొన్ని ఆసక్తికర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News