బ్రిటిషర్ల మాదిరిగా సిమెంటు కంపెనీలను తరిమేస్తా!
బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీలకు తీవ్ర హెచ్చరికలు పంపారు.;
బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీలకు తీవ్ర హెచ్చరికలు పంపారు. సిమెంటు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును అడ్డుకున్నానంటూ తనపై చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. ఒకవేళ పరిశ్రమల యజమానులే తప్పు చేశాయని నిరూపిస్తే ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వచ్చిన ఆరోపణలకు ఆదివారం వివరణ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనపై అరాచకవాదిగా ముద్రవేయడం బాధపెట్టిందన్నారు. పరిశ్రమల యజమానులతో కొందరు లాలూచి పడి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియాపై ధ్వజమెత్తారు. ఈ విషయమై సంబంధిత మీడియా యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తానన్నారు.
తన నియోజకవర్గంలో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. విద్య, వైద్యంపై దృష్టి పెట్టలేదని, ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ విషయాలపై తమ పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించినట్టు ఆయన వివరించారు.
పరిశ్రమల యజమానులు వైసీపీ నేతలకు లొంగిపోయాయని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారించాలని సీఎంవోను కోరుతున్నానని చెప్పారు. తనది తప్పైతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని స్పష్టం చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డి చెప్పిన వాళ్లకే పరిశ్రమల్లో పనులు జరుగుతున్నాయన్నారు. తమ వాళ్లకు పనులు చేయాలని అడగడం తప్పా అని ఎమ్మెల్యే ఆది ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చి కథ నడుపుతున్నారని, బ్రిటీష్ వాళ్లను పారదోలినట్టు తరుముతామని ఎమ్మెల్యే హెచ్చరించారు.