అదేంటి శ్యామలా.. రాజకీయాల్లోనూ యాక్టింగా?

సినిమావోళ్లు మామూలోళ్లు కాదు. ఇప్పుడా విషయం వైసీపీ అధినాయకత్వానికి బాగానే అర్థమై ఉంటుంది.;

Update: 2025-11-04 05:59 GMT

సినిమావోళ్లు మామూలోళ్లు కాదు. ఇప్పుడా విషయం వైసీపీ అధినాయకత్వానికి బాగానే అర్థమై ఉంటుంది. అందరికి తెలిసిన వారితో మసాలా మాటలు మాట్లాడిస్తే బాగుంటుందన్న పార్టీ వ్యూహకర్తల వ్యూహం బెడిసికొట్టిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ప్రైవేటు బస్సు ప్రమాద దుర్ఘటన వేళ వైసీపీ మహిళా నేత కం సినీ నటి శ్యామల చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలు మొత్తం యాక్టింగే అన్నట్లుగా పోలీసు విచారణలో ఆమె చెప్పిన మాటలు ఉండటం గమనార్హం.

కర్నూలు బస్సు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంగా కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్ లో 27 మందిపై కేసులు నమోదయ్యాయి. వీటి విచారణలో భాగంగా ఈ ప్రమాదంపై నటి శ్యామల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావటమే కాదు.. పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసు నోటీసులు అందుకున్న శ్యామల విచారణకు హాజరయ్యారు.

దాదాపు గంటన్నర పాటు సాగిన విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ప్రెస్ మీట్లలోనూ.. పార్టీ వేదికల మీద మీడియాతో మాట్లాడే వేళ ఆమె ప్రదర్శించే ఆగ్రహం.. ఆవేశం.. మొత్తం నటనేనా? అన్న ప్రశ్న ఇప్పుడు కలుగుతుంది. దీనికి కారణం ఆమె పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానమే.

ప్రమాదానికి ముందు శివశంకర్.. అతడి మిత్రుడు ఎర్రిస్వామిలు బెల్టు దుకాణంలోమద్యం తాగారని మీకెలా తెలుసు? మీకు ఎవరు చెప్పారు? దానికి తగిన ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉండే వాటిని చూపించండి? అంటూ అడిగిన ప్రశ్నలకు ఆమె నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది. అవాస్తవాల్ని ఎందుకు ప్రచారం చేశారని ప్రశ్నించగా.. తాను వైసీపీ అధికార ప్రతినిధిని కావటంతో పార్టీ వారు ఇచ్చిన స్క్రిప్టును.. పార్టీ ఆదేశాల మేరకు చదివినట్లుగా చెప్పటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విచారణ వేళ పోలీసులకు చెప్పిన దానికి భిన్నంగా.. విచారణ అనంతరం బయటకు వచ్చిన శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. తాను తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా భేటీలో వైసీపీఅధికార ప్రతినిధిగా పది ప్రశ్నలు అడిగానని.. అందులో తప్పేముందంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. రాజకీయాల్లో ఈ యాక్టింగేంటి తల్లీ? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. పోలీసు విచారణలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే.. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోవటం ఏ నేతకైనా సహజమే. అలాంటప్పుడు ముక్తసరిగా మూడు ముక్కల్లో చెప్పేసి.. కర్ర విరగకుండా.. పాము చావని పద్దతిలో మాట్లాడి వెళ్లిపోతే ఇబ్బంది ఉండదు.

అందుకు భిన్నంగా పోలీసు విచారణలో నీళ్లు నమిలి.. బయటకు వచ్చి అందుకు భిన్నంగా చెప్పే మాటలతో తన మాటలకు విలువ ఉండదన్న విషయాన్ని శ్యామల ఎందుకు గుర్తించటం లేదు? ఒకవేళ విచారణలో తనను ముప్పతిప్పలు పెట్టిన అధికారుల మీద ఆమె విమర్శలుచేసే వీలుందన్నది మర్చిపోకూడదు. సంబంధం లేని ప్రశ్నలు అడిగారని.. విచారణ పేరుతో తనను ఇబ్బందికి గురి చేయాలన్నదే పోలీసుల లక్ష్యమన్న మాటలు మాట్లాడటం ద్వారా అంతో ఇంతో రాజకీయ నేత అన్న ట్యాగ్ కు తగ్గట్లు ఉండేది. అందుకు భిన్నంగా విచారణలో పార్టీని ఇరుకున పెట్టేలా చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తవుతోంది. కెమేరా ముందు నటించే వాళ్లతో ఇదే ఇబ్బంది అంటూ కొందరు వైసీపీ నేతల ఆక్రోశంలో అర్థముందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News