ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. కంగారెత్తిస్తున్న కాక్రోచ్ లు
సీజేపీ ఆందోళనలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. జంతర్ మంతర్ కు నాలుగు కిలోమీటర్ల పరిధిలో సాధారణ రాకపోకలకు కూడా అనుమతించడం లేదు.
దేశరాజధాని ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతోపాటు సర్ ప్రక్రియలో తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలనే డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శనివారం లోగా జ్ఞానేశ్ కుమార్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ గతంలో హెచ్చరించింది. లేనిపక్షంలో జంతర్ మంతర్ 2.0 కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సీజేపీ డిమాండ్ కు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తలొగ్గకపోవడంతో శనివారం ఢిల్లీలో ఆందోళనలకు సీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. అయితే గత జూలైలో సీజేపీ ఆందోళనల కారణంగా తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది.
ఢిల్లీలో భారీ భద్రత
సీజేపీ ఆందోళనలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. జంతర్ మంతర్ కు నాలుగు కిలోమీటర్ల పరిధిలో సాధారణ రాకపోకలకు కూడా అనుమతించడం లేదు. జంతర్ మంతర్ వైపు ఏ ఒక్కరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిరసనకారుల విషయంలో ఢిల్లీ పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిరసనకారులు రెచ్చగొట్టినా నిగ్రహం పాటించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. పరిస్థితిని ప్రొఫెషనల్ గానే ఎదుర్కొవాలని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 34 వేల మంది పోలీసులను మోహరించగా, ఢిల్లీలో ఎక్కడిక్కడ అరెస్టులు కొనసాగుతున్నాయి. దాదాపు వంద మంది ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లతో రియల్ టైంలో నిరసనలు, పోలీసుల స్పందనను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
విమానంలోనే అభిజిత్ అరెస్టు
ఇక జంతర్ మంతర్ 2.0 ఆందోళనల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము శాంతియుతంగానే ఉన్నామని, పోలీసులకు సహకరిస్తామని, విమానం దిగేవరకు వేచివుండాలని ఆభిజిత్ కోరుతున్నా, పోలీసులు మాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. విమానంలో తనను అరెస్టు చేసేందుకు పోలీసుల వచ్చిన విషయాన్ని అభిజిత్ స్వయంగా ఇన్ స్టా లైవ్ లో ప్రసారం చేశారు. అదే విమానంలో అభిజిత్ తోపాటు సీజేసీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీజేపీ న్యాయ సలహాదారు రత్నసింగ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
ఎక్కడాలేని ప్రచారం
ఇక కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు ముందన్నెడూ లేనంత ప్రచారం వస్తోందని చెబుతున్నారు. సీఈసీ రాజీనామా డిమాండ్ తో నాలుగు రోజుల పాటు విపక్షం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండి కూటమి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ధర్నాలు, ఆందోళనలు కన్నా సీజేపీ నిరసనలతోనే ప్రభుత్వం ఆందోళనలకు లోనవుతున్నట్లు తాజా పరిస్థితులు సూచిస్తున్నాయని అంటున్నారు. సీజేపీ కార్యకర్తలను అడ్డుకోడానికి ఢిల్లీ నగరంలో ఎప్పుడూ లేనంతగా భద్రతా ఏర్పాట్లను చేయడాన్ని ఎత్తిచూపుతున్నారు. సహజంగా దేశ రాజధాని ప్రాంతం కావడం, వీవీఐపీలు రాకపోకల కారణంగా ఢిల్లీ 24/7 నిఘా నీడలోనే ఉంటుంది. అదే సమయంలో ఆగస్టు 15, రిపబ్లిక్ డే వంటి జాతీయ పర్వదినాల్లో రెట్టింపు భద్రత ఏర్పాటు చేస్తారు. ఇక ఇప్పుడు ఆయా సమయాల్లో కన్నా అధికంగా భద్రతా బలగాలు మోహరించినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. సీజేపీ పిలుపుతో యువత ఎక్కువగా ప్రభావితం కావడం, క్షణాల్లో దేశవ్యాప్తంగా వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం వల్ల ప్రభుత్వం ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.