మావోయిస్టుల్లో చీలిక.. అభయ లెటర్ తో సంబంధం లేదంటున్న ఎర్రదండు
అభయ్ విడుదల చేసిన లేఖతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తగతమంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ తాజాగా ప్రకటించారు.;
ఆపరేషన్ కగార్.. మావోయిస్టుల్లో చీలిక తెచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బలగాలు తీవ్ర నిర్బంధం విధించడంతోపాటు వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులు ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిన్నారు. ఒకప్పుడు వందల్లో ఉన్న ఉద్యమకారులు ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ రెండు చీలిపోయిందనే సంకేతాలు వస్తున్నాయి. నెల రోజుల సమయం ఇస్తే ఆయుధాలు వదిలేస్తామని రెండు రోజుల క్రితం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి, పొలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ పేరిట లేఖ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అభయ్ లేఖ ఆయన వ్యక్తిగతమంటూ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. దీంతో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ విడుదల చేసిన లేఖపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అభయ్ విడుదల చేసిన లేఖతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తగతమంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ తాజాగా ప్రకటించారు. అభయ్ పేరిట వచ్చిన లేఖతో పార్టీకి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు అభయ్ లేఖను ‘అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదని’ స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని క్యాడర్ ను నిర్మూలించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీతో చర్చించకుండా అభయ్ ప్రకటన విడుదల చేశారని, దానిని తాము ఖండిస్తున్నట్లు జగన్ ప్రకటించారు.
దీంతో అభయ్ పేరిట వచ్చిన లేఖపై సందిగ్ధత ఏర్పడిందని అంటున్నారు. అయితే అభయ్ ప్రకటనను ఖండిస్తున్నట్లు తెలిపిన జగన్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. దీంతో ఆయుధాలు వదిలేయడం, శాంతి చర్చలపై మావోయిస్టుల్లో చర్చ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ కౌంటర్లలో పార్టీ అగ్రనాయకత్వం నష్టపోతున్న సందర్భంగా శాంతి చర్చలు జరపాలని మావోయిస్టుల నుంచి కొంతకాలంగా విజ్ఞప్తులు రావడం నిజమేనంటున్నారు. తాజాగా మావోయిస్టు జగన్ పేరిట విడుదలైన లేఖలో కూడా మార్చిలో కొంతమంది మేథావులు శాంతిచర్చల కమిటీగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైనట్లు వెల్లడించారు. అయితే ప్రభుత్వం ఒకవైపు రక్తపుటేర్లు పారిస్తుండగా, ఎక్కడెక్కడో ఉన్న మావోయిస్టులను సంప్రదించకుండా అభయ్ ఏకపక్షంగా ఆయధాలను వదిలేస్తున్నట్లు ఎలా ప్రకటిస్తారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడం చూస్తే పార్టీ చీలిక దిశగా పయనిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ అలియాస్ మల్లోజుల వేణుగోపాలరావు ఎక్కడున్నారనేది సస్పెన్సుగా మారింది. నెల రోజులు గడువిస్తే తాము ఆయుధాలు వదిలేస్తామని చెప్పడంతోపాటు లేఖపై ఆయన తాజా ఫొటో అతికించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు అభయ్ కు సంబంధించి పోలీసులకు 1986 నాటి ఫొటోనే ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన పేరిట విడుదలైన లేఖపై ఫొటో ఉండటం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. లేఖ విడుదల సందర్భంగా ఫొటో ఎందుకు జత చేశారనేది అంతుచిక్కడం లేదు. అభయ్ భద్రతా బలగాలకు చిక్కారా? వారే వ్యూహత్మకంగా సాయుధ పోరాటం విరమణపై ఆయనతో ప్రకటన చేయించారా? అనేది చర్చకు దారితీస్తోందంటున్నారు.
అయితే అభయ్ ప్రకటన ఏకపక్షం కాదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల ఎన్ కౌంటర్ లో మరణించిన పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ప్రాణాలుతో ఉన్నప్పుడే శాంతి చర్చల ప్రతిపాదన వచ్చిందని, కేడర్, నాయకత్వాన్ని బతికించుకునేందుకు మరో మార్గం లేదని పొలిట్ బ్యూరోలో చర్చించారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు మే నెలలోనే బస్వరాజ్ పేరిట లేఖ విడుదలైనట్లు చెబుతున్నారు. ఈ విషయాన్నే అభయ్ లేఖలో తెలిపారని అంటున్నారు. దీంతో సాయుధ పోరాటంపై మావోయిస్టుల్లో భిన్నవాదనలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి మావోయిస్టులను సమూలంగా అంతమొందిస్తామని కేంద్రం ప్రకటించడంతో ఎర్రదండు భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైందని, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే మార్గం తోచక ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నట్లు ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.