జగన్ బాధితులకు అండగా ఏబీవీ.. కోడికత్తి శ్రీనుతో మొదలుపెట్టిన రిటైర్డ్ డీజీపీ

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓ వినూత్న కార్యక్రమామానికి శ్రీకారం చుట్టారు. మాజీ సీఎం జగన్ బాధితులకు అండగా నిలుస్తానని స్వయంగా ప్రకటించిన ఏబీవీ ఆదివారం తొలి అడుగు వేశారు.;

Update: 2025-04-13 13:14 GMT

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓ వినూత్న కార్యక్రమామానికి శ్రీకారం చుట్టారు. మాజీ సీఎం జగన్ బాధితులకు అండగా నిలుస్తానని స్వయంగా ప్రకటించిన ఏబీవీ ఆదివారం తొలి అడుగు వేశారు. ముమ్మడివరంలో కోడికత్తి శ్రీనును పరామర్శించి జగన్ బాధితుల పరామర్శ యాత్ర చేస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వంలో పోస్టింగు లేకుండా ఐదేళ్లు గడిపి వైసీపీ బాధితుడిగా ముద్రపడిన ఏబీవీ ఇప్పుడు తనలాంటి బాధితులను ఓదార్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

మాజీ సీఎం జగన్ బాధితులకు న్యాయం చేసేందుకు తాను పోరాటం చేయాలని నిర్ణయించినట్లు ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ముమ్మడివరంలో పర్యటించిన ఆయన తన తొలి ఓదార్పు యాత్ర కోడికత్తి కేసు నిందితుడు శ్రీను నుంచే మొదలుపెట్టినట్లు చెప్పారు. శ్రీనుతోపాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు అనంతరం మీడియాతో తన బాధను పంచుకున్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను చేసిన పొరపాటుతో మూడు రెట్ల శిక్ష అనుభవించాడని తెలిపారు. ఈ కేసులో బెయిల్ పై ఉన్న అతడు ఉపాధి కోసం ఏ పనీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఏబీవీ వెల్లడించారు. పేదోడనే జాలి కూడా చూపకుండా కోడికత్తి శ్రీనుపై మాజీ సీఎం జగన్, ఆయన అనుచరులు ఇప్పటికీ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.

కోడికత్తి శ్రీను లానే మిగిలిన జగన్ బాధితుల కోసం తాను పోరాడుతానని ఏబీవీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీవీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ఎలాంటి పోస్టింగుకు నోచుకోలేకపోయారు. పైగా రెండు సార్లు సస్పెండ్ చేసిన వైసీపీ సర్కారు తనను తీవ్రంగా వేధించిందని ఏబీవీ ఆరోపిస్తున్నారు. తనలానే కోడికత్తి శ్రీను, వైఎస్ సునీత వంటి వారు జగన్ బాధితులుగా ఉన్నారని చెబుతున్నారు. తన లాంటివారి కోసం తాను న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్న ఏబీవీ.. తొలిగా కోడికత్తి శ్రీనును ఎంచుకోవడం కూడా చర్చకు దారితీసింది. ఆయన తర్వాత ఎవరిని పరామర్శిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. అధికారం కోసం జగన్ ఓదార్పు చేసినట్లు.. ఏబీవీ చేస్తున్న పరామర్శ వెనుక ఏదైనా కారణం ఉందా? అంటూ పరిశీలకులు ఆరా తీస్తున్నారు. అయితే ఏబీవీ త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ పరామర్శ యాత్ర మరింత ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News