బాబు, జగన్ దోస్తులు..! ఏబీవీకి ఏమైంది?
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై రాజకీయ పోరాటం చేస్తానని ప్రకటించిన ఏబీవీ.. ఇప్పుడు తన విల్లు సీఎం చంద్రబాబు పైనా ఎక్కుపెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.;
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కొత్త అనుమానాలకు తెరలేపారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన ఆలోచనపరుల వేదిక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఒక్కటేనంనటూ సంచలన ఆరోపణలు చేశారు. మెగా కృష్ణారెడ్డి డైరెక్షన్ లో జగన్, కేసీఆర్ ట్రాప్ లో పడిపోయిన చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు ఏబీవీ. టీడీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తారని విమర్శలు ఎదుర్కొన్న ఏబీవీ ఇలా అడ్డం తిరగడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ డిబేట్ గా మారింది. గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఏబీవీ ప్రస్తుత చంద్రబాబు పాలనపైనా సంతృప్తిగా లేరా? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై రాజకీయ పోరాటం చేస్తానని ప్రకటించిన ఏబీవీ.. ఇప్పుడు తన విల్లు సీఎం చంద్రబాబు పైనా ఎక్కుపెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్న ఏబీవీ.. మరికొందరు మేథావులతో కలిసి విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు - జగన్ ప్రభుత్వానికి వారదిగా కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్ వ్యవహరిస్తోందని ఏబీవీ చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్న బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది వాస్తవానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ అని ఏబీవీ ఆరోపించారు.
బనకచర్ల వృథా ప్రాజెక్టు అని అభిప్రాయపడుతున్న ఏబీవీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు పురుడు పోసుకున్నది కూడా చెప్పారు. గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టుపై మెగా ఇంజనీరింగ్ ప్రతిపాదించిందని, అయితే ఎన్నికల హడావుడిలో జగన్ అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు ఏబీవీ. కృష్ణా జలాలను తెలంగాణకు మళ్లించే కుట్రలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెగా ఇంజనీరింగ్ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపాదన పంపారని అంటున్నారు ఏబీవీ. లక్షల కోట్లు ఖర్చు అయ్యే బనకచర్ల వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని, ఆ ప్రాజెక్టు కోసం చేసే రుణాన్ని దశాబ్దాల పాటు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఏబీవీ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ప్రాజెక్టు వల్ల లాభనష్టాలపై చర్చ అలా ఉంచితే, జగన్ డైరెక్షన్ లోనే చంద్రబాబు నడుస్తున్నారని ఏబీవీ ఆరోపించడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి ఆయన చెప్పిన బలమైన కారణం కూడా నిజమనే భావనను వ్యాప్తి చేస్తోందని అంటున్నారు. చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వైసీపీ ఇప్పటివరకు బనకచర్లపై పెదవి విప్పకపోవడం ఏంటని ఏబీవీ ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా హామీలు అమలు చేయలేదని, కారు చౌకగా భూములు విక్రయించేస్తున్నారని విమర్శలు చేస్తున్న వైసీపీ.. చంద్రబాబు భారీ ప్రచారం కల్పిస్తున్న బనకచర్లపై పల్లెత్తు మాటాడకపోవడం ద్వారా పాత-కొత్త ప్రభుత్వాలు ఒకటేనన్న భావన కల్పిస్తున్నాయని అంటున్నారు ఏబీవీ. చంద్రబాబు సన్నిహితుడిగా జగన్ ద్వేషించిన ఏబీవీ తాజా వైఖరి చర్చనీయాంశమవుతోంది. ఏ కారణంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయని అంటున్నారు.