భారత్ రియల్ ఎస్టేట్ చరిత్రలో అతిపెద్ద డీల్
భారతీయ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంచనాలకు అందని విధంగా కొత్త శిఖరాలను అధిరోహించింది.;
భారతీయ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంచనాలకు అందని విధంగా కొత్త శిఖరాలను అధిరోహించింది. దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్ తాజాగా నమోదైంది. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త (ఇండస్ట్రియలిస్ట్) గురుగ్రామ్‌లోని DLF ది కమెలియాస్ ప్రాజెక్ట్‌లో ఏకంగా నాలుగు అద్భుతమైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను ₹380 కోట్లకు కొనుగోలు చేశారు.
*ఒకే భారీ నివాసంగా 35,000 చదరపు అడుగులు
గోల్ఫ్ కోర్స్ రోడ్ వద్ద ఉన్న ఈ DLF ప్రాజెక్ట్, దేశంలోని అత్యంత ధనవంతులకు, పరిశ్రమల అధినేతలకు, ప్రముఖులకు నివాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ మైలురాయి డీల్‌లో భాగంగా కొనుగోలు చేసిన ఇండస్ట్రియలిస్ట్, ఆ నాలుగు ఫ్లాట్‌లను కలిపి సుమారు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే భారీ, విలాసవంతమైన నివాసంగా మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌లో చదరపు అడుగుకు ₹1 లక్ష ధరకు ఈ అపార్ట్‌మెంట్లు అమ్ముడవటం అనేది భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో ఒక సరికొత్త బెంచ్‌మార్క్‌గా మారింది. ఇంతకు ముందు ఆ ప్రాంతంలో ఆస్తులు ఉన్నప్పటికీ, మరింత విశాలమైన, ఎక్స్‌క్లూజివ్ నివాసం కోసం వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
రాయల్టీ లైఫ్‌స్టైల్‌కు చిహ్నం: 'ది కమెలియాస్'
'ది కమెలియాస్' ప్రాజెక్ట్ కేవలం ఇళ్లు కాదు, ఇదొక రాజసం ఉట్టిపడే జీవనశైలికి ప్రతీక. విశాలమైన లేఅవుట్లు, ప్రైవేట్ డెక్స్, కళ్లకు విందు చేసే గోల్ఫ్ కోర్స్ వ్యూస్. అంతర్జాతీయ స్థాయి ఫీచర్లు ఉంటాయి. టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ స్పా, ఇన్‌హౌస్ ఆర్ట్ గ్యాలరీలు వంటి ఫైవ్ స్టార్ రిసార్ట్‌లను తలపించే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.
*సూపర్ రిచ్ వర్గం దూకుడు
సాధారణ ప్రజలకు ఇళ్లు కొనడం రోజురోజుకు కష్టమవుతున్న తరుణంలో, భారతీయ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం సూపర్ రిచ్ వర్గం కారణంగా వేగంగా ఎదుగుతోంది. ఈ డీల్ ద్వారా ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలోని అత్యంత ధనవంతులకు ఇప్పుడు "ఆకాశమే హద్దు" కాదు, ఇకపై వారి విలాసానికి పెంట్హౌస్‌నే హద్దు!