60 ఏళ్ల వృద్ధుడిగా జైలుకు వెళ్లి.. 104 ఏళ్ల కురువృద్ధుడిగా బయటకు..

యూపీలోని కౌశంబి జిల్లా గౌరాయే అనే గ్రామంలో 1977 ఆగస్టు 16న రెండు వర్గాలు గొడవపడ్డాయి.;

Update: 2025-05-24 03:27 GMT

ఎవరైనా తప్పిపోయి పారిపోయి ఐదేళ్లకో పదేళ్లకో ఇంటికి చేరడం గురించి చదివాం.. చేయని నేరానికో, ఆవేశంలో చేసిన తప్పునకో జైలు శిక్ష పడి కొన్నాళ్లకు ఇంటికి రావడం గురించి విన్నాం.. కానీ, ఈయనది మూడో రకం.. అటు ఇంటినుంచి తప్పిపోలేదు.. పారిపోలేదు..! ‘నేరం కూడా చేయలేదు’. కానీ.. ఏకంగా 43 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. దీనికి మూలం 48 ఏళ్ల కిందట జరిగింది.

యూపీలోని కౌశంబి జిల్లా గౌరాయే అనే గ్రామంలో 1977 ఆగస్టు 16న రెండు వర్గాలు గొడవపడ్డాయి. ఇందులో ప్రభు సరోజ్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో లఖన్‌, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అలా 1982 నుంచి వీరు జైల్లోనే ఉన్నారు. తమకు సెషన్స్‌ కోర్టు వేసిన శిక్షను సవాలు చేస్తూ నలుగురు నిందితులు అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లారు. కానీ, కేసు తేలలేదు. ఈ వ్యవధిలో శిక్ష అనుభవిస్తూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లఖన్‌ మాత్రం మిగిలాడు. ఈ నెల 2న కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో జైలునుంచి బయటపడ్డాడు.

వృద్ధుడిగా జైలుకెళ్లి.. కురువృద్ధుడిగా బయటకు..

కేసు నమోదయ్యే నాటికే లఖన్‌ వయసు 56. ఇక 1982 నాటికి 61. అంటే, అప్పటికే వృద్ధుడు. ఇన్నేళ్ల తర్వాత నిర్దోషిగా తేలాడు. 43 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్ష అనంతరం 104 ఏళ్ల వయసులో కురువృద్ధుడిగా బయటకు వస్తున్నాడు.

లఖన్‌ 1921 జనవరి 4న పుట్టినట్లు జైలు రికార్డుల్లో ఉందట. భార్య ఉన్నదో లేదో చెప్పలేం. కానీ, కౌశంబి జిల్లాలో ఆయన కూతురు ఉంటోంది. అక్కడి షరీరా గ్రామంలో నివసిస్తోంది. లఖన్‌ను జైలు అధికారులు ఆమెకు అప్పగించారు.

Tags:    

Similar News