ఇది భారీ ఉద్యోగ కోతల కాలం.. మరో కంపెనీ రంగంలోకి..
ఇప్పుడు ఎక్కడ చూసినా చెప్పుకోవడానికి కోతలు.. ఉద్యోగుల జీవితానికి వాతలు తప్ప ఇంకేం కనిపించడం లేదు.;
ఇప్పుడు ఎక్కడ చూసినా చెప్పుకోవడానికి కోతలు.. ఉద్యోగుల జీవితానికి వాతలు తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఏఐ, ఆటోమేషన్ అంటూ యంత్రాలు వచ్చి టెక్నాలజీ పనిచేస్తుంటే మనుషులు చాలా లోకువ అయిపోతున్నారు. అందుకే కంపెనీలన్నీ తీసి అవతలపాడేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత అనివార్యమవుతోంది. వేలాది లేఆఫ్స్ తో ఉద్యోగులు రోడ్డున పడుతున్న పరిస్థితి నెలకొంది. స్థిరంగా లాభాలు, పెరుగుతున్న ఖర్చులకు కంపెనీలన్నీ ఉద్యోగులపైనే పడి కోతలు విధిస్తున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ‘మెకిన్సె’ అండ్ కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలపై ఆలోచిస్తున్నట్టు తెలియడంతో మార్కెట్ షేక్ అయ్యింది. గత కొన్నేళ్లుగా లాభాల వృద్ధి నిలిచిపోయిన నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందనే బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది.
బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం.. క్లయింట్ లతో నేరుగా పనిచేయని నాన్ క్లాయింట్ ఫేసింగ్ పాత్రల్లో ఉన్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం వరకూ కోతలు విధించే అంశంపై సంస్థలో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే వచ్చే 18 నుంచి 24 నెలల్లోనే వేలాది ఉద్యోగాలు మద్దతు , బ్యాక్ ఆఫీస్ విభాగాల్లో కోల్పోయే అవకాశం ఉంటుంది.
గత ఐదేళ్లుగా మెకిన్సే ఆదాయ వృద్ధి పెద్దగా పెరగకపోయినా.. సంస్థ ఉద్యోగుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. 2012లో సుమారు 17 వేల మంది ఉద్యోగులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 40వేలకు చేరుకుంది. ఈ వేగవంతమైన విస్తరణతోపాటు మారుతున్న మార్కెట్ పరిస్థితులు సంస్థ ఖర్చుల నిర్మాణంపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.
ఈ పరిణామాలపై మెకిన్సె ప్రతినిధి స్పందించారు. ఏఐ సంస్థ వ్యాపార విధానాన్ని వేగంగా మార్చుతోందని తెలిపారు. ఆటోమేషన్, కొత్త టెక్నాలజీలు రావడంతో కొన్ని మద్దతు విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగ కోతల సంఖ్య లేదా ఎప్పుడు తొలగిస్తారనే దానిపై సంస్థ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.
విశేషం ఏంటంటే.. ఖర్చు తగ్గింపు, సామర్థ్య పెంపు వంటి చర్యలను తరుచుగా తన క్లయింట్ లకు సలహాగా ఇచ్చే మెకిన్సె ఇప్పుడు అదే మార్గాన్ని తాను అనుసరించాల్సిన పరిస్థితికి రావడం దౌర్భాగ్యంగా మారింది. ఇది నెమ్మదిస్తున్న ఆర్థికవృద్ధి, టెక్నాలజీ వేగంగా మారుతున్న కాలంలో అగ్రశ్రేణి కన్సల్టింగ్ సంస్థలు కూడా తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తున్నాయనే నిజాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
మొత్తానికి మెకిన్సేలో ప్రతిపాదిత ఉద్యోగ కోతలు ప్రపంచవ్యాప్తంగా కన్సల్టింగ్, ఐటీ, కార్పొరేట్ రంగాల్లో కొనసాగుతున్న మార్పులకు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి.