ఐటీ ఉద్యోగాల కోతల వెనుక అసలు కథ
గత రెండేళ్లలో దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటివి దాదాపు 42,000 ఉద్యోగాలను తొలగించాయి.;
గత రెండేళ్లలో దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటివి దాదాపు 42,000 ఉద్యోగాలను తొలగించాయి. ఈ వార్తలు విన్న చాలామందికి ఆర్థిక మాంద్యం కారణంగానో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్లనో ఉద్యోగాలు పోతున్నాయనే భయం కలుగుతోంది. కానీ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి.
-పనితీరు ఆధారిత తొలగింపులు: ఇది కొత్త విషయం కాదు
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు అనేది ఆర్థిక పరిస్థితికి సంబంధించినది కాదని, అది ఉద్యోగుల పనితీరుకు సంబంధించిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒక ప్రముఖ ఐటీ కంపెనీలోని హెచ్‌ఆర్ మేనేజర్ రాకేష్ కులకర్ణి చెప్పినదాని ప్రకారం, "ఐటీ సంస్థల్లో ప్రతి ఆరు నెలలకొకసారి ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తారు. ఇందులో తక్కువ పనితీరు చూపిన వారిని సంస్థలు తొలగిస్తాయి. ఇది ఒక సాధారణ ప్రక్రియ.. కొత్తగా జరుగుతున్నది కాదు." అని పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే, మరోవైపు కొత్త ప్రాజెక్టుల కోసం అవసరమైన నైపుణ్యాలున్న వారికి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు.
- రిక్రూట్‌మెంట్ ఒక వైపు, తొలగింపులు మరో వైపు
ఇది కేవలం ఉద్యోగాల తొలగింపుల గురించిన కథ మాత్రమే కాదని రాకేష్ స్పష్టం చేశారు. "కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా కంపెనీలు తమ బృందాలను తిరిగి నిర్మిస్తున్నాయి. భవిష్యత్తు సాంకేతిక మార్పులకు అనుగుణంగా పనిచేయగల సామర్థ్యం ఉన్నవారినే కంపెనీలు కోరుకుంటున్నాయి. అందుకే కొన్ని సందర్భాల్లో పనితీరు సరిగా లేనివారిని తొలగిస్తూనే, మరోవైపు అవసరమైన రంగాల్లో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి." అని తెలిపారు.
- భయపడకండి, నైపుణ్యాలపై దృష్టి పెట్టండి
ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు, ఉద్యోగార్థులకు ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించడం. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికే ఉద్యోగాలు కోస్తున్నాయనే ఆలోచన సరైనది కాదు. వారికి సరిగ్గా సరిపోయే, నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కోసం వారు వెతుకుతున్నారు.
కాబట్టి ఉద్యోగం పోతుందేమోనని భయపడి వెనక్కి తగ్గకుండా, కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ఐటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది, కాబట్టి కంపెనీలు తమ వేగానికి అనుగుణంగా ఉద్యోగులు కూడా ఎదగాలని కోరుకుంటున్నాయి. మీ పనితీరును మెరుగుపరుచుకోండి. కొత్త టెక్నాలజీలను నేర్చుకోండి, అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉండండి. ఐటీ రంగం మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది.