దేశంలో నిరుద్యోగ రేటు తగ్గిందా? దేనికి సంకేతం?
ఈ నేపథ్యంలోనే దేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతున్నట్టుగా తాజాగా గణాంకాలు వెల్లడించాయి.;
భారతదేశం యువ జనాభా అధికంగా ఉన్న దేశం. ఈ యువతే మన దేశానికి అసలైన బలం. విస్తారమైన మానవ వనరులు భారత్ కు పెద్ద అస్త్రం అయినప్పటికీ సరిపడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం యువతను ఎన్నాళ్లుగానో వేధిస్తున్న సమస్య. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు స్వయం ఉపాధి మార్గాలను ప్రోత్సహించడమే కాకుండా.. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే దేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతున్నట్టుగా తాజాగా గణాంకాలు వెల్లడించాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తాజా డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 4.7 శాతంగా నమోదైంది. ఇది గత ఎనిమిది నెలల్లో కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం భారీగా ఉద్యోగ భర్తీలు చేపట్టడం.. వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడం ఈ మార్పునకు కారణాలుగా భావిస్తున్నారు.
పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యత్యాసం
గత అక్లోబర్ లో 5.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నుంచి గణనీయమైన తగ్గుదల నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి తగ్గగా.. పట్టణాల్లో అది 6.5 శాతంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, చిన్న తరహా పరిశ్రమల పునరుద్దరణ దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.
తగ్గుదలకు కారణాలు
అధికారుల విశ్లేషణ ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు పెరగడం నిరుద్యోగం తగ్గడానికి ప్రధాన కారణం. మహిళల పని భాగస్వామ్యం గణనీయంగా పెరగడం వల్ల కుటుంబ ఆదాయాలు బలోపేతం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, స్థానిక వ్యాపారాల పునరుజ్జీవనం ఈ మార్పునకు దోహదపడ్డాయి. మరోవైపు పట్టణాల్లో సేవారంగం, రిటైల్ రంగ విస్తరణ ఉపాధి సృష్టికి సహకరిస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
నిరుద్యోగ రేటు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఆశాజనకం సంకేతం. ఉపాధి పెరగడం వల్ల వినియోగ శక్తి పెరిగి ఉత్పాదకత మెరుగుపడుతుంది. అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తగ్గించేందుకు ఇంకా మరిన్ని చర్యలు అవసరం. ప్రభుత్వం పరిశ్రమలు కలిసి నైపుణ్య శిక్షణలు , ఉద్యోగోన్ముఖ విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రానున్న నెలల్లో ఈ సానుకూల ధోరణి కొనసాగితే దేశ జీడీపీ వృద్ధికి మరింత ఊతం లభించనుంది.