బాక్సాఫీస్: ఒక్క రోజులో 900 కోట్లు తెచ్చిన నక్క, కుందేలు

దాదాపు 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, విజువల్స్ పరంగానే కాకుండా కంటెంట్ పరంగా కూడా అదరగొడుతోంది.;

Update: 2025-12-01 11:01 GMT

సినిమా ఇండస్ట్రీలో రికార్డులు అనేవి ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయాయి. స్టార్ హీరోల సినిమాలు, భారీ యాక్షన్ చిత్రాలు విడుదలైనప్పుడు వందల కోట్లు కొల్లగొట్టడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర జరుగుతున్న మ్యాజిక్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇందులో మనకి తెలిసిన పెద్ద హీరోలు ఎవరూ లేరు. కనీసం మనుషులు కూడా స్క్రీన్ మీద కనిపించరు. అయినా సరే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చైనా లాంటి అతిపెద్ద మార్కెట్ లో వేరే దేశాల సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు. వాళ్ళ లోకల్ కంటెంట్ తప్ప బయటి సినిమాలను అంత త్వరగా పట్టించుకోరు. అలాంటి చోట ఒక హాలీవుడ్ సినిమా ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది. అసలు ఇది ఒక సినిమానా లేక బాక్సాఫీస్ దండయాత్రా అనే రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది. కేవలం ఒక్క రోజులో వచ్చిన కలెక్షన్స్ చూసి అక్కడి లోకల్ మేకర్స్ కూడా నోరెళ్లబెడుతున్నారు.

ఆ సెన్సేషనల్ సినిమా మరేదో కాదు.. 'జూటోపియా 2'. అవును, మీరు విన్నది నిజమే. ఇదొక యానిమేషన్ సినిమా. జంతువుల పాత్రల యానిమేషన్ యాక్షన్, కామెడీ ట్రాక్ లతో ఇప్పటికే పార్ట్ 1 ఒక రేంజ్ లో హిట్టయ్యింది. ఇక సీక్వెల్ మూవీ చైనాలో విడుదలైన మొదటి రోజే ఏకంగా 925 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక యానిమేషన్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం అనేది వరల్డ్ సినిమా హిస్టరీలోనే అరుదు. ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్ లోనే 556 మిలియన్ డాలర్లు వసూలు చేసి గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

దాదాపు 150 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, విజువల్స్ పరంగానే కాకుండా కంటెంట్ పరంగా కూడా అదరగొడుతోంది. చైనాలో హాలీవుడ్ సినిమాలకు ఉన్న రికార్డులన్నింటినీ ఈ చిన్న కుందేలు, నక్క కలిసి తిరగరాశాయి. కేవలం నాలుగు రోజుల్లోనే అక్కడ 200 మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో ఇది దూసుకుపోతోంది.

ఇక కథ విషయానికి వస్తే.. డిటెక్టివ్స్ జూడీ హాప్స్, నిక్ వైల్డ్ అనే రెండు పాత్రల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. జూటోపియా నగరాన్ని తలకిందులు చేస్తున్న ఒక మిస్టరీని ఛేదించే క్రమంలో వీరు చేసే సాహసాలు పిల్లలనే కాదు, పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. కొత్త ప్రాంతాల్లోకి వెళ్లి మరీ కేసును సాల్వ్ చేయడానికి వీరు పడే పాట్లు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. అందుకే అక్కడ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.

యానిమేషన్ సినిమాలకు కేవలం పిల్లలే ఆడియెన్స్ అనుకుంటే పొరపాటే అని ఈ సినిమా నిరూపించింది. కంటెంట్ బాగుంటే భాష, ప్రాంతం, జానర్ తో సంబంధం లేకుండా ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. జూటోపియా 2 సక్సెస్ చూశాక, రాబోయే రోజుల్లో చైనా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ మరిన్ని భారీ యానిమేషన్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ బొమ్మల సినిమా బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన ఆట ఆడుకుంటోంది.

Tags:    

Similar News