ఆశాజీ వారసురాలి అరంగేట్రం: చారిత్రక పాత్రతో జనాయ్ భోంస్లే సాహసం
భారతీయ సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల వారసురాలిగా జనాయ్ భోంస్లే సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. జనాయ్ వెండితెర అరంగేట్రం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.;
భారతీయ సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల వారసురాలిగా జనాయ్ భోంస్లే సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. జనాయ్ వెండితెర అరంగేట్రం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా స్టార్ కిడ్స్ గ్లామర్ పాత్రలతో కెరీర్ ప్రారంభిస్తారు.. కానీ జనాయ్ మాత్రం `ద ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్` వంటి పీరియడ్ డ్రామాను ఎంచుకోవడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. చారిత్రాత్మక చిత్రాల ద్వారా ఎంట్రీ ఇవ్వడం అనేది ఒక యువ నటికి అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం గా భావించినా.. అది ఒక క్లిష్టమైన సవాల్‌తో కూడుకున్న వ్యవహారం.
జనాయ్ భోంస్లేకు అతిపెద్ద ప్లస్ పాయింట్ తను పోషిస్తున్న రాణి సాయి భోంస్లే పాత్ర. ఇటువంటి వీరనారి పాత్రలు నటికి సహజంగానే ఒక రాజసాన్ని, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. కేవలం అందంపైనే కాకుండా హావభావాలు, డైలాగ్ డెలివరీపై పట్టు సాధించి తనలో మంచి నటి ఉందని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం కావడం వల్ల తొలి సినిమాతోనే జనాయ్ భోంస్లే పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రయాణంలో సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. చారిత్రక వ్యక్తుల పాత్రలు చేస్తున్నప్పుడు ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో ఇటువంటి పాత్రలను పోషించిన సీనియర్ నటీమణులతో జనాయ్‌ను పోల్చి చూడటం సహజం. ఆ కాలం నాటి భాష, కట్టుబొట్టు, రాజసంతో కూడిన నడకను అలవర్చుకోవడం కోసం యువనటి జనాయ్ భోంస్లే ఎంతో హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఆధునిక కాలపు అమ్మాయిగా ఉండే జనాయ్.. శతాబ్దాల క్రితం నాటి మహారాణిగా మారి మెప్పించడం అనేది తన నటనా సామర్థ్యానికి అసలైన పరీక్ష.
దర్శకుడు సందీప్ సింగ్ ఈ పాత్ర కోసం జనాయ్‌ను ఎంపిక చేయడంలో తన సంప్రదాయబద్ధమైన లుక్స్ ప్రధాన పాత్ర పోషించాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీగా నటిస్తుండగా, ఆయన సరసన నటించడం జనాయ్‌కు పెద్ద అడ్వాంటేజ్. శిక్షణ పొందిన గాయని- నృత్యకారిణి అయిన జనాయ్.. ఇప్పటికే ఈ పాత్ర కోసం యుద్ధ విద్యల్లో శిక్షణ పొందుతూ తన అంకితభావాన్ని చాటుకుంటోంది. `కాంతార` వంటి చిత్రంతో గ్లోబల్ క్రేజ్ సంపాదించిన రిషబ్ శెట్టి సరసన జనాయ్ భోంస్లే కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జనాయ్ భోంస్లే సినీప్రవేశం నిజంగా సాహసోపేతమైనది. రెండు వైపులా పదునున్న కత్తితో ప్రయాణం వంటిది. కేవలం వారసత్వంతో వచ్చే ట్యాగ్‌ను పక్కన పెట్టి తన నటనతో రాణి సాయి భోంస్లే పాత్రకు ప్రాణం పోయగలిగితే నటిగా ఈ రంగంలో స్థిరపడటం ఖాయం. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి టాప్ హీరోలు తనకు మంచి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంది. సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన భోంస్లే కుటుంబం నుండి వస్తున్న ఈ తరం వారసురాలు.. వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న దివంగత గాయనీమణులు ఆశాభోంస్లే-లతా మంగేష్కర్ ల వారసత్వం ఈ రంగంలో ఎదగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.