డీ- గ్లామ్ పాత్ర‌ల‌కు పెరుగుతున్న ప్రాధాన్యం!

ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్ట‌ర్ అంటే ప్రధానంగా సాంగ్స్, గ్లామర్ సీన్స్‌కే పరిమితమనే అభిప్రాయం ఉండేది.

Update: 2026-07-24 12:01 GMT

ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్ట‌ర్ అంటే ప్రధానంగా సాంగ్స్, గ్లామర్ సీన్స్‌కే పరిమితమనే అభిప్రాయం ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా ఆ పరిస్థితి వేగంగా మారుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా క‌ల్చ‌ర్ బలపడిన తర్వాత ఆడియ‌న్స్ అభిరుచిలో వచ్చిన మార్పు కారణంగా హీరోయిన్లు కూడా గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చే పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక బలమైన పాత్ర ప్రేక్షకుల మనసుల్లో మిగిలిపోయేలా చేస్తుందనే నమ్మకం ఇండస్ట్రీలో పెరుగుతోంది.

ఈ ట్రెండ్‌కు స్టార్ డైరెక్ట‌ర్లు కూడా కీలక కారణంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్ వంటి డైరెక్ట‌ర్ల సినిమాల్లో హీరోయిన్ క్యారెక్ట‌ర్లు కేవలం గ్లామ‌ర్‌కే ప‌రిమితం కాకుండా కథలో భాగమవుతాయి. వారి పాత్రలకు ఎమోష‌న‌ల్ స్ట్రెంగ్త్, కథను ముందుకు నడిపే ప్రాధాన్యం ఉండటంతో, అలాంటి అవకాశాల కోసం చాలామంది హీరోయిన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఒక మంచి క్యారెక్ట‌ర్ వస్తే అది కెరీర్‌కు కొత్త దిశను చూపించగలదనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా ఉంది.

సుకుమార్ సినిమాలు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన కథల్లో పాత్రల సహజత్వానికి పెద్దపీట వేస్తారు. గ్రామీణ నేపథ్యం, మేకప్ కంటే ఎమోష‌న్స్ కు ఇంపార్టెన్స్, పాత్రకు తగ్గ లుక్ వంటి అంశాల వల్ల హీరోయిన్‌లు కూడా పూర్తిగా క్యారెక్టర్‌లో కలిసిపోవాల్సి వస్తుంది. అందుకే ఆయన సినిమాల్లో భాగ‌మ‌వ‌డం చాలామంది హీరోయిన్ల‌కు ఓ స్పెష‌ల్ ఛాన్స్ గా భావిస్తారు. గ్లామర్‌ను పక్కన పెట్టి క్యారెక్ట‌ర్ కోసం పూర్తిగా మారిపోవడానికి సిద్ధంగా ఉండే వారికి ఇలాంటి సినిమాలు తమ యాక్టింగ్ ను నిరూపించుకునే వేదికగా మారుతున్నాయి.

ఇదే అంశాన్ని తాజాగా నటి, మోడల్ యుక్తి తరేజా ఓ ఇంట‌ర్వ్యూలో ప్రస్తావించింది. తనను కేవలం ప్రెట్టీ ఫేస్ గా మాత్రమే చూడకూడదని, నటిగా గుర్తింపు పొందాలనేదే తన టార్గెట్ అని ఆమె వెల్లడించింది. ఫ్యూచ‌ర్ లో డీ-గ్లామ్ క్యారెక్ట‌ర్లు వ‌స్తే సంతోషంగా చేస్తానని, ముఖ్యంగా సుకుమార్ సినిమాలో అలాంటి రోల్ చేయ‌డం తన కల అని చెప్పింది.

యుక్తి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపిస్తున్న పెద్ద మార్పును ప్రతిబింబిస్తున్నాయి. కమర్షియల్ గ్లామర్ ఒక్కటే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. ఓటీటీ విస్తరణ, భాషల మధ్య సరిహద్దులు చెరిగిపోవడం, కథకు ప్రాధాన్యం పెరగడం వంటి కారణాలతో హీరోయిన్లు కూడా తమ టాలెంట్ ను చాటుకునే క్యారెక్ట‌ర్ల‌ను ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒక బలమైన డీ గ్లామ్ రోల్ ఆడియ‌న్స్ లో నమ్మకాన్ని పెంచడమే కాదు, నటిగా వారికి ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకురాగలదనే అభిప్రాయం మరింత బలపడుతోంది. ఈ నేప‌థ్యంలో యుక్తి తరేజా లాంటి కొత్త తరం నటీమణులు కూడా గ్లామర్ కంటే పాత్రకు ప్రాధాన్యం ఇస్తున్నామని బహిరంగంగా చెప్పడం, ఇండస్ట్రీలో మారుతున్న ఆలోచనా విధానానికి మరో సంకేతంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News