ఇండియాలో సెంచరీ కొట్టిన ఒడిస్సీ!
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం వాటిని సంచలనాలు చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. నోలన్ కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలుస్తోంది. తొలి వారం ముగిసేసరికి ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా అంచనాలను తలకిందులు చేస్తోంది. భారతీయ సినీ మార్కెట్‌లో హాలీవుడ్ చిత్రాలకు లభిస్తున్న ఆదరణ మరోసారి నిరూపితమైంది. విడుదలైసన మొదటి వారంలోనే 'ది ఒడిస్సీ' భారతదేశంలో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను విజయవంతంగా దాటింది.
దీంతో ఈ ఏడాది భారత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ప్రీమియర్‌కు లభించిన స్పందనే ఈ భారీ విజయానికి నాంది పలికిందని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఉత్తర అమెరికా తో పాటు విదేశీ మార్కెట్లలో వస్తున్న ఆదరణతో సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లోనే 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3300 కోట్లకు పైగా) వసూళ్ల మైలురాయిని అధిగమించింది. తొలి వారం ఓపెనింగ్స్ పరంగా నోలన్ సినిమాల్లో ఇదే అత్యుత్తమ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక హంగులతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.
హోమర్ రాసిన పురాణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రంలో గ్రీకు యోధుడు ఒడిస్సెస్ పాత్రలో మ్యాట్ డెమన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రోజన్ యుద్ధం తర్వాత పదేళ్ల పాటు సాగే ఆయన సాహసయాత్ర, ఎదురైన సవాళ్లు, రాక్షసులు, శక్తులను ఎదుర్కొంటూ తన భార్య పెనెలోప్, కుమారుడిని కలుసుకునే భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. సినిమాలో ఆన్ హాథవె, టామ్ హాలండ్, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటించి సినిమా స్థాయిని మరింత పెంచారు. సింకోపీ ఇంక్ పతాకంపై తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని యూనివర్సల్ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఇక భారత్ లో హాలీవుడ్ కి వంద కోట్ల వసూళ్లు కొత్తేం కాదు. చివరిగా `అవతార్ : ది వే ఆఫ్ వాటర్` భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా (సుమారు రూ. 484 కోట్లకు పైగా) ప్రథమ స్థానంలో ఉంది. అవెంజర్స్: ఎండ్‌గేమ్ కూడా అత్యంత ఆదరణ పొందిన మార్వెల్ సినిమాగా రికార్డు సృష్టించింది. 373 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. `అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్` 220 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. `స్పైడర్ మ్యాన్: నో వే హోమ్` 218 కోట్లు వసూలు చేసింది. ఇంకా మరికొన్ని హాలీవుడ్ సినిమాలు భారత్ లో వంద కోట్ల వసూళ్లను సాధించాయి.