మెగా హీరోల కామెడీ జానర్.. ఇతను కూడా సక్సెస్ కొడితే..
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు యాక్షన్, లవ్, మాస్, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్ని జానర్లలోనూ తమదైన ముద్ర వేశారు.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు యాక్షన్, లవ్, మాస్, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్ని జానర్లలోనూ తమదైన ముద్ర వేశారు. కానీ, ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెగా హీరోలు కామెడీకి ఓకే అంటే.. బాక్సాఫీస్ వద్ద నవ్వులతో పాటు కలెక్షన్ల వర్షం కురిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు కూడా కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీగా తెరకెక్కుతుండటంతో.. మెగా హీరోలకు కామెడీ జానర్ ఎంతగా కలిసి వచ్చిందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
చిరంజీవి కెరీర్ ను తీసుకుంటే.. ఆయనకు కామెడీ టైమింగ్ ప్రత్యేక బలం. చంటబ్బాయిలో అమాయక డిటెక్టివ్‌గా, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఫన్నీ డాన్ గా, అందరివాడులో తనదైన వినోదంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ ప్రారంభంలో కామెడీకి పెద్దపీట వేశారు. తొలిప్రేమ, బద్రి, జల్సా వంటి చిత్రాల్లో ఆయన చెప్పిన డైలాగులు, మ్యానరిజమ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా జల్సాలో పవన్ కామెడీ టైమింగ్ ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటుంటారు. రామ్ చరణ్ కెరీర్ ప్రారంభంలో ఆయన ఎక్కువగా మాస్, యాక్షన్ కథలకే ప్రాధాన్యం ఇచ్చినా.. కామెడీ టచ్ ఉన్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాయక్, ఎవడులో ఆయన ఫన్ సీన్స్ అలరించాయి. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర పూర్తిస్థాయి కామెడీ కాకపోయినా.. అమాయకత్వంతో కూడిన కామెడీ కనెక్ట్ అయింది.
అలాగే అల్లు అర్జున్ విషయానికి వస్తే.. జులాయి, రేసుగుర్రం సినిమాలు ఆయన కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచాయి. ఆ రెండు చిత్రాల్లోనూ అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాయి ధరమ్ తేజ్ కూడా సుప్రీమ్, చిత్రలహరి వంటి చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ను ఈక్వల్ గా చూపించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ ఇప్పటివరకు ఎక్కువగా భావోద్వేగ ప్రధాన కథలతోనే కనిపించారు.
ఇప్పుడు వరుణ్ తేజ్ కెరీర్ కూడా కీలక దశలో ఉంది. ఫిదా, ఎఫ్-2 వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆయన.. తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే ఇటీవల వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఈసారి ఎంటర్టైనింగ్ స్టోరీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొరియన్ కనకరాజు దర్శకుడు మేర్లపాక గాంధీ కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. దీంతో సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
అదే సమయంలో విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా బడ్జెట్ లో దాదాపు ఇప్పటికే రికవరీ అయినట్లు సమాచారం. ఏదేమైనా మెగా హీరోలకు కామెడీ జానర్ కొత్త కాదు. గతంలో ఆ జానర్ వారిని విజయాల బాట పట్టించింది. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి కొరియన్ కనకరాజు కూడా మెగా హీరోల కామెడీ హిట్ల జాబితాలో చేరుతుందా? వరుణ్ కు మరో విజయాన్ని అందిస్తుందా? అనే క్వశ్చన్లకు ఆన్సర్లు మూవీ రిలీజ్ అయ్యాక తెలియనున్నాయి.