Begin typing your search above and press return to search.

ఫెయిల్యూర్ డైరెక్ట‌ర్ అంటూ న‌టి విమ‌ర్శ‌లు!

తాజాగా ప్రముఖ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పెర్ల్ మైనే చేసిన కొన్ని వ్యాఖ్యలు మలయాళ చిత్ర పరిశ్రమలో సంచ‌ల‌నంగా మారాయి.

By:  Srikanth Kontham   |   24 July 2026 8:00 PM IST
ఫెయిల్యూర్ డైరెక్ట‌ర్ అంటూ న‌టి విమ‌ర్శ‌లు!
X

సమకాలీన పరిణామాలు, ఉద్యమాలపై ప్రముఖులు స్పందించడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఈ అభిప్రాయాలు ఊహించని వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పెర్ల్ మైనే చేసిన కొన్ని వ్యాఖ్యలు మలయాళ చిత్ర పరిశ్రమలో సంచ‌ల‌నంగా మారాయి. విద్యార్థుల నిరసనలు, శాంతిభద్రతల అంశంపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు, విమర్శలకు కారణమయ్యాయి. ఈ క్రమంలో తన పోస్టుపై వ‌స్తోన్న‌ విమర్శలు, వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోయిన పెర్ల్ మైనే కాస్త ఘాటుగానే స్పందించారు.

తనను వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ఆమె ఓ సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేయగా అందులో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సిబి మలయిల్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెద్దది చేశాయి. ఒక `విఫలమైన దర్శకుడు`. తన నాలుగు పేజీల పోస్ట్ మీద పది పేజీల స్క్రిప్ట్ రాస్తున్నాడంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించడం చర్చనీ యాంశమైంది. అయితే ఆ వివాదాస్పద పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే పెర్ల్ మైనే పోస్టును తొలగించడంతో పాటు.. తన ఖాతాలో కామెంట్స్ సెక్షన్‌ను సైతం నిలిపివేశారు. ప్రజల నుంచి వ‌స్తోన్న తీవ్రమైన ఒత్తిడి, ట్రోలింగ్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగ‌ని అంతటితో వివాదం సద్దుమణగలేదు మరింత వేడెక్కింది. పెర్ల్ మైనే వ్యాఖ్యల ప‌ట్ల‌ సిబి మలయిల్ కుమారుడు జో రంగంలోకి దిగారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన పెర్ల్ మైనే వ్యాఖ్యలపై ధీటైన బదులిచ్చారు. తన తండ్రిని విఫలమైన దర్శకుడు అని సంబోధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆమె వ్యాఖ్యలు బాధ్యతా రహితంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, వాదనలు మరింత ముదిరాయి. సెలబ్రిటీలు భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకునే క్రమంలో తోటి కళాకారులను, సీనియర్లను కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్న త‌లెత్తింది. ప్రజా సమస్యలపై అభిప్రాయాలు పంచుకునేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విష‌యాన్ని నెటి జ‌నులు గుర్తు చేస్తున్నారు.

కళారంగంలో అనుభవమే అతిపెద్ద పాఠశాల అయినా? తరతరాల మధ్య వచ్చే భావజాల భేదాలు కొన్నిసార్లు ఇలాంటి బహిరంగ వాదోపవాదాలకు వేదికవుతుంటాయి. సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే యువత తమ అభిప్రాయాలను హేతుబద్ధంగా వ్యక్తపరిచినప్పుడే సమాజంలో.. చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. సోషల్ మీడియాను వ్యక్తిగత కక్ష సాధింపులకు .. విమర్శల దాడికి వేదికగా మార్చుకోకుండా సజాతీయమైన చర్చలకు ఉపయోగించుకోవడం నేటి తరం బాధ్య‌త‌న్న‌ది అంతా గుర్తించాలి.